హైదరాబాద్ : తెలంగాణ లో మహిళలను మరింత వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రైతు వేదికల మాదరిగా మహిళా వేదికలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. నాబార్డు, ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సమాఖ్య, ఎనబుల్ సంస్థలు కలిసి అత్యుత్తంగా పనిచేస్తున్న స్వయం సహాయక సంఘాలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అవార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ మహిళల సంక్షేమం, అభివృద్ధి, భద్రతకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు. స్వయం సహాయక బృందాల్లో షూరిటీ లేకుండా 3 లక్షల రుణాలు తీసుకున్న మహిళలు దురదృష్టవశాత్తు చనిపోతే వారి రుణాలను మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మూడు లక్షల రుణం తీసుకుని కొంత చెల్లించిన తర్వాత చనిపోతే,చెల్లించిన మొత్తాన్ని పూర్తిగా వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు తెలిపారు.
మాజీ సీఎస్ కాకి మాధవరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సాధికారత కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. మహిళా స్వయం సహాయక బృందాల అత్యుత్తమ పనితీరులో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉండగా ఏపీ రెండోస్థానంలో ఉందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు మహిళా సంఘాలకు 4 వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తే, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూ. 18వేల కోట్ల రుణాలు ఇస్తుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మండల కేందాల్లో మహిళా సంఘాలకు కూడా రైతు వేదికల వంటి భవనాలు కట్టాలని సీఎం ఆదేశించారని తెలిపారు.
కామారెడ్డికి మొదటి స్థానం..
జాతీయ స్థాయిలో తెలంగాణకు చెందిన కామారెడ్డి మండల మ్యూచువల్ ఎయిడెడ్ సహకార సమాఖ్యకు మొదటి బహుమతి, దక్షిణ భారత దేశ కేటగిరిలో హనుమకొండ జిల్లా బ్రహ్మదేవరపల్లి మండల మ్యూచువల్ ఎయిడెడ్ సహకార సమాఖ్యకు రెండో బహుమతి రావడం పట్ల మంత్రి ప్రత్యేకంగా నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.