Guava | అన్ని వేళల్లా తక్కువ ధరలో లభించే పండ్లల్లో జామకాయలు కూడా ఒకటి. ఈ పండ్లు మనకు విరివిగా లభిస్తూ ఉంటాయి. అలాగే వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. వీటిని నేరుగా తినడంతో పాటు స్నాక్స్, సలాడ్ రూపంలో, పానీయాల రూపంలో కూడా దీనిని తీసుకుంటూ ఉంటారు. జామకాయలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. జామకాయల్లో విటమిన్ సి తో పాటు అనేక సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. దీనిని దేశీ సూపర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. 100 గ్రాముల జామకాయల్లో దాదాపు 68 కిలో కేలరీలు, 2.5 గ్రా. ప్రోటీన్, 14 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 5.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాగే 100 గ్రాముల జామపండులో దాదాపు 228 మి.గ్రా. విటమిన్ సి ఉంటుంది.
రోజూ ఒక జామపండును తీసుకుంటే చాలు మన శరీరానికి కావల్సిన విటమిన్ సి మొత్తం లభిస్తుంది. జామపండును తీసుకోవడం వల్ల మన మొత్తం శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. జామకాయలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలు గురించి అలాగే దీనిని తీసుకునే సరైన సమయం గురించి పోషకాహార వైద్యులు వివరిస్తున్నారు. జామపండు మన శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జామపండులో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు చర్మం బిగుతుగా తయారవుతుంది. జామపండులో ఉండే ఫైబర్ గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల పేగు కదలికలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా తిన్న ఆహారం సులభంగా జీర్ణమవ్వడంతో పాటు మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది.
జామపండులో పొటాషియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా శరీర బరువును అదుపులో ఉంచడంలో కూడా జామపండు మనకు సహాయపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి త్వరగా వేయకుండా ఉంటుంది. దీంతో శరీర బరువు అదుపులో ఉంటుంది. జామపండును తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. జామపండు తక్కువ గ్లైసెమిక్ స్థాయిలను కలిగి ఉంటుంది. కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా ఈ పండును తీసుకోవచ్చు. జామపండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కనుక దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షలు త్వరగా మన దరి చేరకుండా ఉంటాయి.
ఆయుర్వేదం ప్రకారం జామపండును పగటిపూట తీసుకోవడం మంచిది. ఉదయం లైట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంతరం తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు మద్దతును ఇవ్వడంతో పాటు దీనిలో ఉండే పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయి. అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన 2 గంటల తరువాత ఈ పండును తీసుకోవడం మంచిది. భారీ భోజనం చేసిన తరువాత జామపండును తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఖాళీ కడుపుతో పండని, గట్టిగా ఉండే జామకాయను తీసుకోవడం అంత మంచిది కాదు. జామపండు రుచిగా ఉన్నప్పటికి పిల్లలు దీనిని నేరుగా తినడానికి ఇష్టపడరు. అలాంటి వారు జామపండుతో జామ ఫెటా సలాడ్, జామ స్మూతీ, జామ చాట్ వంటి వాటిని తయారు చేసి తీసుకోవచ్చు. ఈ విధంగా జామకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.