మహబూబాబాద్ : మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మహిళలకు కానుకగా మహిళా ఆరోగ్య పథకాన్ని(Womens Health Scheme) తీసుకురానున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli)వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు అధ్యక్షతన ముందస్తూ మహిళా దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్(CM KCR) పాలనలోనే మహిళలకు మహర్దశ వచ్చిందని పేర్కొన్నారు.మహిళల సాధికారత కోసమే అనేక పథకాలు తీసుకొచ్చారని తెలిపారు.అభయ హస్తం నిధులు వాపస్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.అభయ హస్తం మహిళల్లో అర్హులైన వారికి పెన్షన్లు ఇచ్చేందుకు సీఎం నిర్ణయించారని వివరించారు.స్త్రీ నిధి ద్వారా 18వేల కోట్ల రుణాలు మంత్రి కేటీఆర్(Minister KTR) చేతుల మీదుగా అందజేయనున్నట్లు వెల్లడించారు.
మహిళలకు అసలైన ఆత్మ బంధువు సీఎం కేసీఆర్ (CM KCR) అని తెలిపారు.అవకాశాలు అందిపుచ్చుకోవడం లో మహిళలు ఎవరికీ తీసిపోరని కొనియాడారు. తెలంగాణలో మహిళలకు స్థానిక సంస్థల్లో, మార్కెట్ కమిటీల్లో 50 శాతం రిజర్వేషన్లు(Reservation) కల్పిస్తూ మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని గుర్తు చేశారు.జీహెచ్ఎంసీ, జీడబ్ల్యూఎంసీ చరిత్రలో మొదటి సారిగా మేయర్, డిప్యూటీ మేయర్ల పదవులను మహిళలకు కట్టబెట్టిన ఘటన సీఎం కేసీఆర్‌దేనని అన్నారు.
మహిళలను ఆదుకునేందుకు సేవా గృహాలు, స్టేట్ హోమ్స్, రెస్క్యూ హోమ్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, వృద్ధాప్య గృహాలు, ప్రత్యేక పాలిటెక్నిక్, డిగ్రీ మహిళా రెసిడెన్షియల్ కాలేజీలు నిర్వహిస్తూ ఆడపిల్లలు, మహిళల సమగ్ర వికాసం, సంరక్షణ కోసం కృషి జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళల భద్రతకు షీటీమ్స్, ఒంటరి, వృద్ధ, వితంతు, బీడి కార్మిక, బోధకాలు, నేత, గీత మహిళలకు పెన్షన్లు ఇస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామని వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా రూ. లక్షా ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఆయన అన్నారు.