సమాజంలో సగమైన మహిళలు అన్నిరంగాల్లో పురోగమించినప్పుడే దేశాభివృద్ధి సంపూర్ణం అవుతుంది. 9 ఏండ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పథకాలతో మహిళా సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందుతున్నది. నారీమణులు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
– ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మహిళ ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం’ అని నమ్మిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ‘ఆరోగ్య మహిళ’ పేరుతో వైద్యారోగ్య శాఖ రూపొందించిన ఈ కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రారంభం కానున్నది. కరీంనగర్‌లోని బుట్టిరాజారాం కాలనీలో ఉన్న యూపీహెచ్‌సీలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు.
మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ కార్యక్రమం అమలు కానున్నది. తర్వాత విద్యలో వనితకు అందలం అవనిపై ఆమెదే పైచేయి! సింగరేణి సిగలో స్త్రీ డిజిటల్ పురోగమనంలో మహిళ మహిళా శ్రేయోరాజ్యం తెలంగాణ సహనశీలి.. ప్రతిభాశాలి మహిళా దినోత్సవ ప్రత్యేక వ్యాసాలు వేదిక పేజీలో.. దశలవారీగా 1200 కేంద్రాలకు విస్తరించనున్నారు. ఇందులో పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానలు ఉంటాయి. ఇక్కడ ప్రతి మంగళవారం ప్రత్యేకంగా ‘ఉమెన్ క్లినిక్’లు నిర్వహిస్తారు. ఆడవారు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందిస్తారు.
ఉమెన్ క్లినిక్స్‌కు వచ్చే మహిళలకు అక్కడికక్కడే బీపీ, షుగర్, అనీమియా పరీక్షలు నిర్వహిస్తారు. బీపీ, షుగర్ పరీక్ష యంత్రాలు ఇప్పటికే అందుబాటులో ఉండగా, అనీమియా కో సం హిమోగ్లోబిన్ మీటర్లను సరఫరా చేశారు. వీటితోపాటు టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారు. రిపోర్టులను 24 గంటలలోపే అందిస్తారు. సమస్యలను గుర్తిస్తే, అక్కడికక్కడే తగిన మందులు ఇస్తారు. అవసరమైతే పై దవాఖానలకు రెఫర్ చేస్తారు.
1. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు
2. ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్రీనింగ్
3. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతోపాటు, విటమిన్ బీ12, విటమిన్ డీ పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు
4. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు
5. మెనోపాజ్ దశకు సంబంధించిన పరీక్షలు. అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్‌తో అవగాహన కలిగిస్తారు.
6. నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైనవారికి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు
7. సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.
8. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.
దేశంలో క్యాన్సర్ బారినపడిన మహిళల్లో 25% మంది నోరు(ఓరల్), రొమ్ము (బ్రెస్ట్), గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ బాధితులే. ఈ నేపథ్యంలో ఉమెన్ క్లినిక్స్‌లో క్యాన్సర్‌పై ప్రత్యేక దృష్టిపెట్టారు. 30 ఏండ్లకు పైబడిన మహిళలందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనిం గ్ చేయనున్నారు. సర్వైకల్, ఓరల్ క్యాన్సర్లకు లక్షణాల ఆధారంగా పరీక్షలు చేస్తారు. ప్రాథమికంగా లక్షణాలు గుర్తించినవారిని జిల్లా కేంద్రంలోని దవాఖానకు లేదా సూపర్‌స్పెషాలిటీ దవాఖానకు రెఫర్ చేస్తారు. అక్కడ మామోగ్రామ్, కల్పోసోపి, క్రియోథెరపి, బయాప్సి, పాప్‌స్మియర్ పరీక్షలు చేస్తారు. వ్యాధి నిర్ధారణ అయితే హైదరాబాద్‌లోని నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానల్లో చికిత్స అందిస్తారు. మహిళల్లో అయోడిన్ లోపం (థైరాయిడ్ ), విటమిన్ డీ3, బీ-12 వంటి సూక్ష్మపోషక లోపాలను లక్షణాల ఆధారంగా పరీక్షిస్తారు.
ఈ కార్యక్రమం మొత్తాన్ని ప్రత్యేక యాప్, వెబ్ పోర్టల్ ద్వారా పర్యవేక్షించనున్నారు. పరీక్షల కోసం వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలను అందులో నమోదు చేస్తారు. ఏయే సమస్యలు గుర్తించారు? ఏ మందులు అందజేశారు? ఎవరిని రెఫర్ చేశారు వంటి వివరాలన్నీ అందులో పొందుపరుస్తారు. ఈ వివరాలు జిల్లా దవాఖానలకు, టెర్షియరీ కేర్ సెంటర్లకు వెళ్తాయి.
కరీంనగర్లో ప్రారంభించనున్న ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
విద్యానగర్, మార్చి 7 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ పథకానికి శ్రీకారం చుడుతున్నది. కరీంనగర్ మార్క్‌ఫెడ్‌లో జరిగే మహిళల ఆత్మీ య సమ్మేళనంలో ఈ పథకాన్ని మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఉదయం 10.15 గంటలకు బుట్టి రాజారాం కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్లో పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఉదయం 11 గంటలకు ప్రభు త్వ దవాఖానలోని ఎంసీహెచ్‌లో వంద పడకలతో వార్డు, రేడియాలజీ హబ్, ఆరో గ్య మహిళ వార్డు ప్రారంభంతోపాటు క్రిటికల్ కేర్ యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. 11.30 గంటలకు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు పరిశీలించి, మధ్యాహ్నం 12 గంటలకు విద్యార్థినులకు కార్డియాక్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను చైతన్య డిగ్రీ కళాశాలలో ప్రారంభించనున్నారు. 12.30 గంటలకు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్క్‌ఫెడ్‌లో నిర్వహించనున్న వేడుకల్లో హరీశ్‌రావు పాల్గొంటారు.