KR Nagaraju | పర్వతగిరి, ఏప్రిల్ 5: అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని ప్రజలు భగ్గుమంటున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో శనివారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ యాత్రలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, సీనియర్ నేత వరద రాజేశ్వర్రావు పాల్గొనగా ప్రజలు సమస్యలపై నిలదీశారు. దూప తండా, పెద్దతండా, మోత్యతండా, రావూర్ మీదుగా సాగినయాత్రలో తండావాసులు కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు.
గ్యారెంటీలు అమలుచేయకపోతే స్థానిక ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ‘ఆసరా పింఛ న్లు పెంచలేదు. 2 లక్షలల్లోపు మాఫీ పూర్తిగా అమలు కాలేదు. మహిళలకు రూ.2,500 ఇస్తామన్న హామీ ఏమైంది’ అంటూ ఎమ్మెల్యే నాగరాజుతోపాటు కాంగ్రెస్ నాయకులను నిలదీశారు.
యాత్రతో పార్టీకి మైలేజీ వస్తుందనుకుంటే సీన్ రివర్స్ అయ్యిందని చర్చించుకోవడం గమనార్హం. పేదల ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేసి సానుభూతి తెచ్చుకోవాలనుకుంటే సదరు నాయకులకు చుకెదురైంది. రావూర్లో మీడియాతో మాట్లాడుతుండగానే కరెంట్ కట్ కావడంతో ఆ పార్టీ నేతలు అసంతృప్తికి గురయ్యారు. ఇలాగైతే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కష్టమేనని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకోవడం వినిపించింది.