Congress Govt | హైదరాబాద్, డిసెంబర్26 (నమస్తే తెలంగాణ): వాళ్లంతా అత్యంత పేద మైనార్టీ మహిళలు. ఏదో ఒక కుట్టుమిషన్ వస్తే ఉపాధి దొరుకుతుందని ఆశ. కుటుంబానికి ఎంతోకొంత ఆర్థిక ఆసరా లభిస్తుందని ధీమా. వారి స్వప్నాన్ని సాకారం చేసే దిశగా గత ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కానీ ఇంతలోనే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మళ్లీ మొదటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. దీంతో ప్రభుత్వ తీరుపై మైనార్టీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అత్యంత నిరుపేదలైన మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకుగాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. మైనార్టీ వర్గాలందరికీ కలిపి 18వేల కుట్టుమిషన్లు, కేవలం క్రిస్టియన్ మైనార్టీలకు 2వేల కుట్టుమిషన్లను మొత్తంగా ‘కేసీఆర్ కానుక పేరిట’ 20వేల మంది మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లను అందజేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే గత ఏడాది ఆగస్టులోనే మైనార్టీ మహిళల నుంచి దరఖాస్తులను మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్వీకరించింది. పలు జిల్లాల్లో లబ్ధిదారులను గుర్తించడంతోపాటు, కుట్టుమిషన్లను కూడా కార్పొరేషన్ పంపిణీ చేసింది. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ రావడంతో కుట్టుమిషన్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో దరఖాస్తు చేసుకున్న అర్హలైన మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేయకుండా మళ్లీ కొత్తగా లబ్ధిదారుల ఎంపికకు దరఖాస్తులను స్వీకరించడాన్ని ఇటీవలే ప్రారంభించింది. దీనిపై మైనార్టీ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పంపిణీ కోసం ఇప్పటికే జిల్లాలకు చేరవేసిన కుట్టుమిషన్లపై కేసీఆర్ చిత్రం ఉండగా దానిని తొలగిస్తున్నారు.