హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): మహిళలకు స్వావలంబన కల్పించడానికి మోదీ సర్కారు చర్యలు తీసుకోవడం లేదని.. మహిళా సంఘాలకు కేంద్రం రూ.15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు రూ.16.5 లక్షల మేర రుణమాఫీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి.. మహిళలకు రుణం ఇవ్వడానికి మాత్రం మనసు రావడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెబుతూ మహిళలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. బుధవారం తెలంగాణ మహిళా సాధికారత సమాఖ్య సభ్యులు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో ఎప్పుడూ తాము అబద్ధాలు చెప్పలేదని పేర్కొన్నా రు.
మహిళా సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పామని.. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభు త్వం మాత్రం రూ.20 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నట్టు అబద్ధాలు చెబుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రూ.5 లక్షల మేరనే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నదని, కానీ అబద్ధాలు చెప్పి మహిళలను మభ్యపెడుతున్నదని ధ్వజమెత్తారు. ప్రతీ చిన్న పనికి నిధులు ఇచ్చే కేంద్రప్రభుత్వం మహిళలకు మాత్రం ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తు తం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్న నేపథ్యంలో కేంద్రం రూ.15 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్యాంకులకు రుణాలు ఎగవేసి లూటీ చేసే బడా వ్యాపారవేత్తలకు రూ.16.5 లక్షల కోట్ల మేర రుణాలను కేంద్రప్రభు త్వం మాఫీ చేసిందని అన్నారు. మహిళల సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీ ప్రభుత్వం.. గ్యాస్ ధరను రూ.50 పెంచి గుదిబండను మోపిందని మండిపడ్డారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతుంటే.. దేశంలో పెంచడమేంటని నిలదీశారు. ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నిస్తే.. ‘ప్రధాని మోదీ ఇంత గొప్పోడు, అంత గొప్పోడు’ అని బీజేపీ నాయకులు అంటున్నారని ఎద్దేవా చేశారు.