హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆకతాయిలు పెరిగిపోతున్నారు. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ తరహా వేధింపుల్లో మైనర్ల నుంచి 60 ఏండ్ల వారి వరకూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్ర ఉమెన్‌సేఫ్టీ వింగ్ డీజీ శిఖాగోయెల్ గురువారం షీటీమ్స్ అర్ధ సంవత్సర నేర సమీక్షలో ఈ విషయాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 331 షీటీమ్స్ పనిచేస్తున్నాయని తెలిపారు. ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు, ఈమెయిల్స్, సోషల్ మీడియా వేదికల్లో వేధింపులు అధికంగా పెరిగాయని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు మొత్తం 6,129 కేసుల్లో 449 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని తెలిపారు. వీటిలో 2,314 పెట్టీ కేసులు ఉండగా, 1,085 మందికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు తెలిపారు. 358 కేసులు ప్రాసెస్‌లో ఉన్నాయని, డయల్ 100 ద్వారా 15, వాట్సాప్, ఫేస్‌బుక్‌తో1,216, నేరుగా 1,138 ఫిర్యాదులు స్వీకరించామని చెప్పారు. 3,366 కేసుల్లో నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు శిఖాగోయెల్ వెల్లడించారు. మహిళల పట్ల జరిగే నేరాలు, ఫిర్యాదు చేసే విధానంపై చేపట్టిన అవగాహన కార్యక్రమాలు 3,78,747 మందికి చేరుకున్నట్టు చెప్పారు.రాష్ట్రంలో 26 భరోసా కేంద్రాలుండగా. వాటిని 35కి చేర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఉమెన్ సేఫ్టీవింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.