రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్/కరీంనగర్ కార్పొరేషన్ : ‘కేసీఆర్ సార్ పాలనలోనే మంచిగుండె. కాంగ్రెసోళ్లు వచ్చినంక అరిగోస పడుతున్నం. నీళ్లు వత్తలేవు. ఫిల్టర్ నీళ్లు కొనుక్కునే అయిసత్ లేకపాయె. కరెంటు ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వదు. మళ్లీ కేసీఆర్ సార్ వచ్చి ఉంటే గింత గోస పడేటోళ్లం కాదు’ అని సిరిసిల్ల పట్టణ మహిళలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో తమ సమస్యలను ఏకరువు పెట్టారు. బుధవారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించారు. పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాత్రి సిరిసిల్లలోని బీవైనగర్లోగల బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ సయ్యద్ సీమా బేగం అక్రం నివాసానికి వెళ్లారు. అక్కడ తేనేటీ విందు స్వీకరించారు. కేటీఆర్ తమ వార్డుకు వచ్చిన విషయం తెలుసుకొన్న స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కేటీఆర్‌ను కలిసి రాఖీలు కట్టారు. ‘కేసీఆర్ సార్ సీఎంగా ఉన్నప్పుడు మిషన్ భగీరథ నీళ్లు రోజూ వచ్చేవి. ఇప్పుడు దినం విడిచి దినం వస్తున్నాయి. ఇచ్చేనీళ్లకు కూడా టైం అంటూ లేదు. పచ్చ కలర్లో వస్తున్నాయి. తాగేందుకు పనికొస్తలేవు’ అంటూ లావణ్య, అంబవ్వ అనే మహిళలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. తమ వార్డులో బోరు పని చేస్తలేదని, మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని, వార్డు కౌన్సిలర్ సీమాబేగం అక్రమ్ సొంత ఖర్చులతో మంచిగ చేయించారని తెలిపారు. కరెంటుకు కష్టకాలం వచ్చిందని, ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక రాత్రిళ్లు చీకట్లో మగ్గుతున్నామని ఆవేదన చెందారు. మురికి కాలువలను శుభ్రం చేస్తలేరని, దోమల బెడదతో రోగాల బారిన పడుతున్నామని, చేసిన కష్టమంతా మందులకే సరిపోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇందిరమ్మ చీరలకు కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన మాలు మంచిగ లేదని, సాంచాలకు రూ.పదివేలు ఖర్చుపెట్టి డిజైన్లు చేయించుకుంటే ఒక్క భీమే ఇస్తున్నారని, తమకేమి పడతలయితలేదని నేతన్నలు కేటీఆర్‌తో మొరపెట్టుకున్నారు. అప్పట్లో బతుకమ్మ చీరలకు మంచి పగారొచ్చిందని, ఇప్పుడు అంత వస్తలేదని వాపోయారు. వారి ఆవేదనకు చలించిన కేటీఆర్ అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులను పిలిచి ఈ సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కేసీఆర్‌పై కోపంతోటి రేవంత్కన్నెపల్లి మోటర్లు ఆన్చేస్తలేడని కేటీఆర్ తెలిపారు. పంపులు ఆన్ చేస్తే సిరిసిల్ల మానేరు వాగులో ఎప్పుడు నీళ్లుంటేండేవని అన్నారు. తాగు, సాగుకు ఇబ్బందులు తలెత్తేవి కాదని చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.