హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ఓ రైతు ఆవేదనను, ఆక్రందనను తమ చానల్లో ప్రసారం చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేయడంపై జర్నలిస్టు సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్టులు మండిపడ్డారు. ప్రజల అభిప్రాయాలను, భావోద్వేగాలను వార్తగా రాస్తే, చానళ్లలో ప్రసారం చేస్తే జర్నలిస్టులను, ఆయా సంస్థల నిర్వాహకులను ఎలా నిర్బంధిస్తారని ప్రశ్నించారు.
మగ పోలీసులు మఫ్టీలో వెళ్లి ఓ తీవ్రవాదిని అరెస్టు చేసినట్టుగా పల్స్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ రేవతి ఇంటిని చుట్టుముట్టి ఆమెను అదుపులోకి తీసుకోవడాన్ని ఖండించారు. న్యూస్ రిపోర్టర్ తన్వీ యాదవ్‌ను కూడా పోలీసులు నిబంధనలను ఉల్లంఘిస్తూ అరెస్టు చేయడాన్ని ఆక్షేపించారు. రేవతి అరెస్టును బుధవారం ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ఖండించగా, గురువారం జర్నలిస్టు సంఘాల నేతలు, సీనియర్ ఎడిటర్లు, జర్నలిస్టులు స్పందించారు.
ప్రశ్నించడం పౌరుల ప్రాథమిక హక్కు అని, దానిని ప్రసారం చేయడం మీడియా బాధ్యత అని, తమకు వ్యతిరేకంగా మాట్లాడించారని ఆరోపిస్తూ ప్రభుత్వం మహిళా జర్నలిస్టులపై కేసులు పెట్టి సంకెళ్లు వేయడం ఎటువంటి సంస్కృతి అని నిలదీశారు. అక్రమ కేసు పెట్టడంతోపాటు అరెస్టు ప్రక్రియ కూడా అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులతో జర్నలిస్టుల గొంతు నొక్కాలనుకొంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు..
తెలంగాణలో ముఖ్యమంత్రి మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, విభజనలను రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే అభియోగాలతో ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేయడం దారుణం. వారిని అరెస్టు చేయడం సమస్యకు పరిష్కారం కాదు. ఇది అసహనం అనే అంటువ్యాధి ఫలితంగా వచ్చిన పరిణామం.
-కపిల్ సిబల్, రాజ్యసభ సభ్యుడు
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉన్నది. ప్రజలను తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తమకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజల హక్కు. ప్రజల బాధలను, ఎమోషన్లను ప్రసారం చేయడం జర్నలిస్టుల బాధ్యత. జర్నలిస్టుల మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే విరమించుకోవాలి. అరెస్టు చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను భేషరతుగా విడుదల చేయాలి. ఇదేవిధంగా నిరంకుశంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. అధికారం ఉన్నది కదా అని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రజల హక్కులను కాలరాయవద్దు.
-చంటి క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్యే, జర్నలిస్టుల సంఘం నేత
రేవంత్‌రెడ్డి సర్కారు ఆలోచనలు, అనుసరిస్తున్న పద్ధతులు, పనుల గురించి గ్రామీణ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాట్లాడుకుంటున్నారు. కడుపు మండిన రైతులు, ప్రజలు బహిరంగంగానే తిడుతున్నరు. దీనిని జీర్ణించుకోలేని సర్కారు అణచివేయాలని చూస్తున్నది. ఇద్దరు మహిళా జర్నలిస్టుల అరెస్టును కూడా ఇందులో భాగంగానే చూడాలి. పోలీసులు కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేయడానికి తెల్లవారుజామున 40 మంది పోలీసులను పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది. వారు టెర్రలిస్టులు కాదు.. జర్నలిస్టులు నిత్యం ప్రజలతో మమేకమయ్యే సాధారణ పౌరులు. కనీస నాగరికత ఉండాలి. ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు చేయడాన్ని ఖండిస్తున్నా.
– టంకశాల అశోక్, సీనియర్ ఎడిటర్
వీడియో ఉన్న సమాచారం, విశ్లేషణ విషయం పక్కనబెడితే పౌరులను అరెస్టు చేసే ముందు అవసరమైన ప్రక్రియను అనుసరిస్తే బాగుండేది. ప్రశ్నించడం పౌరుల ప్రాథమిక హక్కు. తప్పు ఒప్పులను నిర్ణయించేవి కోర్టులు. ఏ పౌరుడినైనా అరెస్టు చేసే ముందు పూర్వాపరాలు ఆలోచించి హక్కులకు భంగం వాటిల్లకుండా అరెస్టు చేస్తే బాగుండేది. హఠాత్తుగా అదుపులోకి తీసుకోవడం అనుమానాలకు
తావిస్తున్నది.
– వనం జ్వాల నర్సింహారావు, కాలమిస్టు
మహిళా జర్నలిస్టుల అరె స్టు అన్యాయం. ఇది మహిళా హక్కులను కాలరాయడమే. తెల్లవారుజామున ఐదు గంటలకు అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. వారు ఎక్కడికైనా పారిపోతారా? వారు టెర్రరిస్టులు కాదు. మహిళా సాధికారత, మహిళా హక్కుల గురించి మాట్లాడే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా జర్నలిస్టుల గొంతు నొక్కడం దారుణం. ప్రభుత్వాల అణచివేత ఇలాగే కొనసాగితే జర్నలిజంలోకి మహిళలు రావడానికి భయపడతారు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నది.
– జూలూరు గౌరీశంకర్, సీనియర్ జర్నలిస్టు
ఇద్దరు మహిళా జర్నలిస్టులను తెల్లవారుజామున అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నా. వారిపై ఈ నెల 10న ఫిర్యాదు చేస్తే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కేసులు పెట్టారు. అక్రమ కేసులు పెట్టి మహిళా జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం సమంజసం కాదు. కేసులను విరమించుకుని విడుదల చేయాలి
– అస్కానీ మారుతిసాగర్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి
ప్రజల బాధలను, వారి భావోద్వేగాలను చూపించడం జర్నలిస్టుల బాధ్యత. హైడ్రా పేదల ఇండ్లు కూల్చివేస్తున్న సమయంలో ప్రజల ఎమోషన్స్‌ను ఎవరు ఆపగలరు? వాటిని రికార్డు చేసి టీవీ చానళ్లలో, యూట్యూబ్స్‌లో ప్రసారం చేయడం జర్నలిస్టుల విధి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే నాలుగో స్తంభంగా మీడియా ప్రతినిధులుగా మా విధులు మేము నిర్వహిస్తుంటాం. ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేయడం దారుణం. వారు ఎవరూ ప్రభుత్వంపై నేరుగా ఎలాంటి వ్యాఖ్యానాలు, విమర్శలు చేయలేదు. కేవలం రైతు బాధను రికార్డు చేసి ప్రసారం చేశారు. టెర్రరిస్టుల, దోపిడీ దొంగల మాదిరిగా కండ్లను మార్క్ చేసి ఫొటోలు రిలీజ్ చేయడం ఏమిటి? ఆడపిల్లలను చూసి ఎందుకు భయపడుతున్నరు. గతంలో కొండారెడ్డిపల్లెలో కూడా మాపై ఇలాగే దౌర్జన్యం చేశారు. అక్రమ అరెస్టులతో జర్నలిస్టుల గొంతు నొక్కాలనుకొంటే ఎప్పటికీ సాధ్యం కాదు.
– సరితాయాదవ్, సీనియర్ జర్నలిస్టు