దేవరుప్పుల, అక్టోబర్ 12: పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు నామినేషన్ ఖర్చులు అందజేసేందుకు మహిళలు ముందుకు వచ్చారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా కుట్టుశిక్షణ పొందిన మహిళలు ఈ మేరకు విరాళాలు సేకరించారు. గురువారం వారు తమకు తోచిన డబ్బులను అందజేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమకు నెల రోజులపాటు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుట్టుశిక్షణ ఇచ్చి, ఉచితంగా మిషన్ అందజేశారని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో రోజూ భోజన సదుపాయం కల్పించారని వారు గుర్తుచేశారు. ఇందుకు కృతజ్ఞతతో తాము సేకరించిన డబ్బులతో ఎర్రబెల్లి నామినేషన్ వేయాలని వారు కోరారు.