వరంగల్‌చౌరస్తా, జనవరి 7: భర్త తన ఆస్తిని కాజేయడంతోపాటు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆగ్రహించిన భార్య కత్తితో దాడికి యత్నించిన ఘటన బుధవారం వరంగల్ నగరంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరానికి చెందిన మేరుగు శ్రీకాంత్, జ్యోత్స్న దంపతులు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా చాలాకాలం క్రితం కోర్డు ద్వారా విడాకులు తీసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు.
కేసు కోర్టులో కొనసాగుతుండగా ఆస్తిని తనకి దక్కకుండా చేస్తున్నాడని, మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపిస్తూ జ్యోత్స్న బుధవారం కత్తితో భర్తపై దాడి చేయడానికి యత్నించింది. గమనించిన స్థానికులు జ్యోత్స్నను శాంతింపజేయడానికి శ్రీకాంత్‌ను స్థానికులు, తోటి వ్యాపారులు అక్కడి నుంచి తప్పించారు. స్థానికులు అడ్డుకొని, నచ్చజెప్పే ప్రయత్నం చేసినా జ్యోత్స్న వినకుండా అన్యాయం చేయాలని చూస్తున్న వ్యక్తిని వదిలేది లేదని ఆర్ఎన్టీ రోడ్డులోని బాధితుడు జ్యువెల్లరీ షాపు ముందు బైఠాయించింది.
విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కి తరలించారు. మహిళను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో సదరు మహిళ చేతికి స్వల్ప గాయమైంది. మహిళ మానసిక స్థితి సరిగా లేదని, కుటుంబసభ్యులకు సమాచారం అందించి, వారికి అప్పగించినట్లు ఇంతేజార్గంజ్ పోలీసులు తెలిపారు.