RTC Buses | హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన రాఖీ పండుగ నేపథ్యంలో అక్కాచెల్లెళ్లు తమ సోదరుల వద్దకు వెళ్లేందుకు పయనమయ్యారు. దీంతో ఆడబిడ్డలందరూ ఆయా బస్టాండ్లకు చేరుకుంటున్నారు. కానీ సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని ఎంజీబీఎస్ బస్టాండ్లో జిల్లాలకు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. కానీ బస్సులు సమయానికి రాకపోవడంతో ఆర్టీసీ అధికారులపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. పండుగల వేళ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇవాళ శ్రావణ శుక్రవారం, రేపు రాఖీ పండుగ, ఎల్లుండి ఆదివారం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు కూడా తమ సొంతూర్లకు వెళ్లేందుకు బస్టాండ్లకు చేరుకోవడంతో ప్రయాణికులతో బస్టాండ్ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. మొత్తంగా బస్సులు తగినన్ని లేకపోవడంతో ప్రయాణికులందరూ ఆర్టీసీ అధికారులపై కస్సుమంటున్నారు.