వరంగల్ : మెడికల్ ట్రీట్మెంట్ కోసం అడవిని వదిలి, ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళా మావోయిస్టుతో పాటు మరో ముగ్గురు సానుభూతి పరులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వైద్యానికి వచ్చిన వారి నుంచి 50 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు, రూ. 74 వేల నగదు, ఒక కారు, సెల్ఫోన్లతో పాటు విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిని దంకారణ్యం సౌత్ జోన్‌కు చెందిన డాక్టర్స్ టీమ్ కమాండర్ మదకం ఉంగి అలియాస్ కమల(30), అసం సోహేన్(35), మీచ్ అనిత(21), గొడ్డి గోపాల్‌గా గుర్తించారు. ఈ నలుగురు కూడా ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ములుగు – వరంగల్ రోడ్డులో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ములుగు – వరంగల్ రహదారిలోని అజరా హాస్పిటల్ వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ కారు అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ఈ వాహనాన్ని తనిఖీ చేయగా, భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయని తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, మావోయిస్టులని తేలిందన్నారు. మదకం ఉంగి చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి వచ్చిందని చెప్పారు.
ఇదే సమయంలో అసం సోహేన్.. హనుమకొండలోని గుర్తు తెలియని వ్యక్తుల వద్ద పేలుడు పదార్థాలను కొనుగోలు చేసినట్లు డీసీపీ తెలిపారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌కు తిరిగి వెళ్తుండగా, అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 15 ఏండ్ల క్రితం ఉంగి మావోయిస్టు పార్టీలో చేరారని పేర్కొన్నారు. కొంతకాలం మెడికల్ ట్రైనింగ్ తీసుకున్నారని, ఆ తర్వాత గాయపడ్డ మావోయిస్టులకు ఆమెనే చికిత్స అందిస్తున్నారని డీసీపీ వెల్లడించారు. 2017లో ఛత్తీస్‌ఘడ్‌లో 25 మంది పోలీసులను మట్టుబెట్టిన కేసులో ఉంగి కీలకపాత్ర పోషించారు. దీంతో పాటు పలు ఎన్కౌంటర్లలో ఆమె పాత్ర ఉందన్నారు. ఉంగి గత కొంతకాలం నుంచి రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తెలిపారు.