హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తేతెలంగాణ)/ కుమ్రంభీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/కాగజ్నగర్, నవంబర్ 29 : పత్తి ఏరుతున్న మహిళపై పులి దాడి చేసి చంపిన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం గన్నారంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి (22) మరో 20 మంది కూలీలతో కలిసి సమీపంలోని చేనులో పత్తి ఏరేందుకు వెళ్లింది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో అందరూ పనిలో నిమగ్నం కాగా.. పెద్ద పులి ఒక్కసారిగా మోర్లె లక్ష్మిపై దాడి చేసింది. కూలీలు గట్టిగా కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. లక్ష్మిని వెంటనే పట్టణంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బంధువులు, రైతులు లక్ష్మి మృతదేహంతో కాగజ్నగర్ డివిజనల్ కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా చేశారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే లక్ష్మి మృతి చెందిందని, సెక్షన్, బీట్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లక్ష్మి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ధర్నా విరమించబోమని భీష్మించుకు కూర్చున్నారు. హుటాహుటిన డీఎఫ్వో కార్యాలయానికి చేరుకున్న ఆదిలాబాద్ సీఎఫ్ శాంతారాం, ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి నీరజన్కుమార్ టిబ్రివాల్, ఎస్పీ శ్రీనివాసరావు మృతురాలి అంత్యక్రియల కోసం రూ. 20 వేలు, ఎక్స్గ్రేషియా కింద రూ. 10 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. మరో రూ. 10 లక్షలు అందించేందుకు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 5 ఎకరాల భూమి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
జిల్లాలో పులుల దాడుల్లో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. 2020 నవంబర్ 11న దహెగాం మండలం దిగిడకు చెందిన విఘ్నేష్ చేపల వేటకు వెళ్లగా, పులి దాడి చేయడంతో మృతి చెందాడు. 2020 నవంబర్ 29న పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల (15) పత్తి ఏరుతుండగా పెద్ద పులి దాడిచేసి చంపేసింది. 2023 నవంబర్ 16న వాంకిడి మండలం ఖానాపూర్కు చెందిన రైతు సిడాం భీము తన చేనులో పత్తి ఏరుతుండగా పులి పంజా విసరడంతో మృత్యువాత పడ్డాడు. తాజాగా.. శుక్రవారం కాగజ్నగర్ మండలం గన్నారంలో పత్తి ఏరుతున్న మహిళపై పులి దాడి చేసి చంపడం కలకలం రేపింది.
ఉమ్మడి జిల్లాలో పులి దాడులు దడపుట్టిస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో నిత్యం పశువులపై దాడులు చేస్తున్నాయి. అటవీ సమీప గ్రామాల ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి దాడులు చేస్తాయోనని వణికిపోతున్నారు.