మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 2 : దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మహబూబాబాద్ మండ లం లక్ష్మాతండా శివారు రేకులతండాకు చెందిన భూక్యా జనార్దన్, పద్మ (41) దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. వీరికి ఉన్న నాలుగు ఎకరాలకు గాను రెండెకరాల్లో మిర్చి, ఎకరంలో పత్తి, మరో ఎకరంలో వరి సాగుచేస్తున్నారు. వరి, పత్తితో సరైన ఆదాయం రాకపోగా మిర్చికి సైతం తెగుళ్లు సోకడంతో అప్పులు చేసి పురుగుల మందులు కొడుతున్నారు.
దీనికితోడు నిరుడు సరైన దిగుబడి రాక పెట్టుబడి కోసం తీసుకొచ్చిన అప్పు తీరలేదు. రెండేండ్ల క్రితం పెద్ద కూతురు వివాహానికి కూడా అప్పుచేశారు. అప్పు మొత్తం రూ. ఆరు లక్షల వరకు పెరిగింది. నాలుగైదు రోజులుగా అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి అడుగుతుండటంతో వారికి సమాధానం చెప్పలేక పద్మ సోమవారం ఇంట్లో పురుగుల మందు తాగింది. ఇంటి పక్కనున్న వారు గుర్తించి దవాఖానకు తీసుకెళ్తున్న క్రమంలోనే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.