కాసిపేట, నవంబర్ 10 : అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం.. కాసిపేట మండలం కొత్తవరిపేటకు చెందిన గుండా శ్రీదేవి (38) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నది. భర్త సుధాకర్ మంచిర్యాల ప్రైవేట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. శ్రీదేవి తమకున్న రెండున్నర ఎకరాలతోపాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి సాగు చేసింది.
ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశం లేకపోవడంతో పెట్టుబడితోపాటు ఇత ర అవసరాల కోసం చేసిన రూ.3 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇంత అప్పు ఎలా తీర్చుతావని భర్త ప్రశ్నించడంతో మనస్తాపం చెందిన శ్రీదేవి ఈనెల 5న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాల హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడం తో వరంగల్‌కు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.