ములుగురూరల్, సెప్టెంబర్11 : డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మహిళ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని గొల్లవాడలో బుధవారం చోటుచేసుకుంది. గొల్లవాడ కాలనీకి చెందిన వంగల జ్యోతి (48) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. స్థానికంగా వైద్యం చేయించినా తగ్గకపోవడంతో రెండు రోజుల క్రితం వరంగల్ ఎంజీఎం దవాఖానలో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందిందని స్థానికులు తెలిపారు.
మిడ్జిల్, సెప్టెంబర్ 11: చోరీ చేసేందుకు వెళ్లిన తండ్రీకొడుకు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలానికి చెందిన బాలస్వామి (42), జయరాజ్ (17) తండ్రీకొడుకులు. మంగళవారం అర్ధరాత్రి మిడ్జిల్ మండలంలోని బోయిన్పల్లి గ్రామ సమీపంలో ఉన్న సోలార్ ప్లాంట్‌లో దొంగతనం చేయడానికి వచ్చారు. ఇక్కడ అమర్చే తీగల్లో ఉండే రాగి తీగను చోరీ చేయాలని ప్రయత్నించారు. సోలార్ ప్లాంట్‌లో గతంలో పలుమార్లు రాగి తీగ కోసం చోరీలు జరగడంతో అధికారులు ఫెన్సింగ్ వైర్‌కు విద్యుత్తు సరఫరా చేశారు. ఈ విషయం తెలియని ఇద్దరు ప్రహరీపై ఉన్న ఎలక్ట్రిక్ వైర్లను కట్ చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు బుధవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకొని వారి మృతదేహాలను జడ్చర్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శివనాగేశ్వర్ నాయుడు తెలిపారు.