Telangana | భర్తే లోకమని భావించింది ఆ భార్య. నిండునూరేళ్లు తనకు తోడుగా ఉంటాడని అనుకుంది. కానీ అర్ధాంతరంగా భర్త మరణించడం తట్టుకోలేకపోయింది. ఆయన లేని జీవితంలో ఉండలేనని తన రెండేళ్ల కుమారుడిని చంపి, తాను ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌కు చెందిన ప్రవీణ్ గౌడ్‌తో అఖిల (25)కు దాదాపు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి రెండేళ్ల కుమారుడు శ్రియాన్ గౌడ్ ఉన్నారు. ప్రవీణ్‌గౌడ్ కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే అనారోగ్య సమస్యలతో ఏడాది కిందట ప్రవీణ్ మరణించాడు. అప్పటి నుంచి కుమారుడితో కలిసి అత్తారింట్లోనే అఖిల ఉంటుంది. తరచూ భర్త ప్రవీణ్ జ్ఞాపకాలతో బాధపడుతుండేది.
చిన్నవయసులోనే భర్తను కోల్పోయిన అఖిలను చూసి అత్తమామలు కూడా చలించిపోయారు. మరో వివాహం చేసుకుని కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని అఖిలకు పలుమార్లు సూచించారు. కానీ ఆమె వారి మాటలు వినిపించుకోలేదు. తరచూ భర్తనే గుర్తుచేసుకుంటూ తీవ్ర మనస్తాపానికి గురయ్యేది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కుమారుడికి ఉరేసి.. తాను ఉరేసుకుని అఖిల చనిపోయింది. కాసేపటికి అత్త జమున ఇంటికొచ్చి, ఎంతసేపు తలుపుకొట్టిన అఖిల తీయలేదు. దీంతో అనుమానం వచ్చి స్థానికులసాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. అప్పటికే అఖిల మృతిచెందగా.. శ్రేయాన్ ఊపిరితో ఉన్నట్లు అనిపించి హుటాహుటిన రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే శ్రేయాన్ మృతిచెందాడని వైద్యులు తెలిపారు.