Feroz Khan | హైదరాబాద్ : మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 21వ తేదీన గాంధీభవన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడే సందర్భంగా ఫిరోజ్ ఖాన్ మహిళల్ని అవమానించేలా పలు వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అతని వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు మహిళల పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని కమిషన్ భావించింది. ఈ మేరకు తను చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 4న విచారణకు వచ్చి వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుల్లో.. 2025 జూన్ 21న హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
ఫిరోజ్ ఖాన్ ప్రకటన మహిళలను కించపరిచేలా, ముఖ్యంగా తెలంగాణ మహిళలను అవమానించేలా ఉందని కమిషన్ గమనించింది. కమిషన్ అటువంటి వ్యాఖ్యలను తీవ్రమైనవిగా, పరువు నష్టం కలిగించేవిగా భావిస్తోంది. అందువల్ల, తెలంగాణ మహిళా కమిషన్ చట్టం, 1998లోని సెక్షన్ 16(1)(b) కింద విచారణ ప్రారంభించింది. ఫిరోజ్ ఖాన్ జూలై 4న ఉదయం 11:00 గంటలకు కమిషన్ ముందు తప్పకుండా హాజరు కావాలని, ఈ విషయానికి సంబంధించిన అన్ని సంబంధిత పత్రాలను సమర్పించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తెలంగాణలోని మహిళల గౌరవం, హక్కులను కాపాడటానికి కట్టుబడి ఉంది అని పేర్కొంది.