హైదరాబాద్, జనవరి30(నమస్తే తెలంగాణ): కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. కేసీఆర్ తెలంగాణ సాధకుడు. ప్రజాసంక్షేమం కోసం తపించిన అభివృద్ధి ప్రదాత. ఇప్పుడు అనుభవిస్తున్న పదవులన్నీ కేసీఆర్ ఉద్యమ ఫలమే. కేసీఆర్‌ను అవమానించే విధంగా నిర్ణయాలు తీసుకునే ముందు దాన్ని గుర్తించుకోవాలి. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్‌కింగ్, మహాత్మాగాంధీ తరహాలో నిలకడగా కలిగిన అహింసామార్గంలో ఆయన ఉద్యమాన్ని నడిపారు. అందుకే కేసీఆర్ తెలంగాణ జాతిపిత. కేసీఆర్‌ను కేసుల పేరిట, విచారణ సాకులతో ఆయన్ను అవమానించడాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు. రాజకీయ విభేదాలు ఉంటే రాజకీయంగానే ఎదుర్కోవాలి. కానీ కక్షసాధింపు చర్యలు సహేతుకం కాదు. ఆరోపణలు, అభియోగాలతో కేసీఆర్ వైపు వేలెత్తి చూపితే.. తెలంగాణ వైపు వేలెత్తి చూపినట్టే. తెలంగాణ నేలను కేసీఆర్‌ను విడదీసి చూడలేము. రాజకీయ అంశాల ప్రాతిపదికగా విభేదిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ వ్యక్తిగత స్థాయిలో కక్ష పూనడం అనేది ఏ రూపకంగా కూడా సమర్థనీయం కాదు. అతనో మేధోశిఖరం. ప్రపంచంలోనే తెలంగాణను రోల్‌మాడల్‌గా నిలబెట్టిన దార్శనికత వారిది. దీన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ అంగీకరిస్తారు. ఈ నేల నవనాడుల్లో పోటెత్తే ఉద్యమ ఉత్తేజ శబ్దం అతను. వ్యక్తిగత వివాదాల కన్నా.. సమాజ సంక్షేమమే మిన్న.. అని భావించే కేసీఆర్‌ను వివాదంలోకి లాగడం మంచి పరిణామం కాదు. వైరభావన ఒక సంకుచిత దృష్టి, దాన్ని పాలకులు విడనాడాలి.
-గోరటి వెంకన్న, ఎమ్మెల్సీ, ప్రజాకవి
కేసీఆర్ ఎక్కడ నివసిస్తున్నరో ‘సిట్’కు తెలియదా?
సిట్‌ను ఎవరు నడుపుతున్నారో ఈ రోజు కేసీఆర్‌కు సిట్ అధికారులు ఇచ్చిన మరో నోటీసుతో బట్టబయలైంది. 160 సీఆర్పీసీ కింద నోటీస్ ఇచ్చిన సిట్ తనను ఎక్కడ సంప్రదించాలో, తన చిరునామా ఏమిటో కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. అయినా నందినగర్ మాత్రమే అధికారిక రికార్డులో ఉన్నదని సిట్ అధికారులు పేర్కొనడం విడ్డూరంగా ఉన్నది. గతంలో ప్రభుత్వ అధికారిక ఉత్సవాలకు కేసీఆర్‌ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లికి ప్రొటోకాల్ అధికారులు వెళ్లిన విషయం మరచినట్టున్నారు. అంతేకాదు ఇటీవల మేడారం ఉత్సవాలకు ముగ్గురు మంత్రులు కేసీఆర్ ఉంటున్న ఎర్రవెల్లి నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. అంతకంటే ముందు మరో సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆహ్వానించారు.
రాష్ట్రంలోని మంత్రులు, ప్రొటోకాల్ అధికారులకు కేసీఆర్ ఎక్కడ నివాసం ఉంటున్నారో స్పష్టంగా తెలిసినప్పటికీ సిట్ అధికారులకు తెలియలేదా? అని నేను ప్రశ్నిస్తున్నా. అదీ కాకుండా తను ఎక్కడుంటున్నానో చాలా స్పష్టంగా పేర్కొన్నప్పటికీ దాన్ని సిట్ అధికారులు ఎందుకు నిరాకరించే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది. దీని వెనుకాల రాజకీయ దురుద్దేశాలు ఉన్నందునే కేసీఆర్‌ను వేధించాలని లక్ష్యంగా ఉన్నందునే సిట్ ఈ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తున్నది. ఇది అప్రజాస్వామికం. ఇది ఒక వ్యక్తి హక్కులను హరించే కుట్ర. అంతేగాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుండి నడిపిన వ్యక్తి, తెలంగాణ మొట్టమొదటి ప్రభుత్వానికి 10 సంవత్సరాల పాటు సారథ్యం వహించిన వ్యక్తి. అలాంటి వారితో ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు అని విచారణాధికారులు తెలుసుకుంటే బాగుంటుంది.
-క్రాంతికిరణ్, సీనియర్ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్యే అందోల్
దటీజ్ తెలంగాణ.. దటీజ్ కేసీఆర్
తెలంగాణలో పిట్ట వాలని చెట్లు మళ్లీ చిగురించాయి. నెర్రెలు బాసిన కరువు నేలలు పచ్చని మాగాణాలు అయ్యాయి. కోటి కత్తులు ఝులిపిన కాలం మారి నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణగా మారింది. హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారింది. హైదరాబాద్ సై వేలతోనే కాకుండా జలసిరిలో మహా కాలేశ్వరం సృష్టించిన జల విప్లవాలు ఈ నేలను ఆర్థిక ధాన్యాగారంగా మార్చాయి. ఆర్థిక స్వయం సమృద్ధిలో దేశానికే తలమానికంగా తెలంగాణ నిలిచింది. దటీజ్ తెలంగాణ.. దటీజ్ పదేండ్ల పాలన.. దటీజ్ కేసీఆర్. కేంద్రమే చెప్పింది వినుకోండి.. కనుకోండి.. చూసుకోండి. నేటి తెలంగాణ ప్రగతి రథచక్రాన్ని అభివృద్ధి తెలంగాణ.. ప్రేమను పంచే తెలంగాణ.. గంగా యమునా తహజీబ్ సంసృతి గల తెలంగాణ.. పట్టెడన్నం పెట్టే తెలంగాణగా మార్చింది ఎవరు? కక్షల కాఠిన్యాల తెలంగాణగా తయారు చేస్తుంది ఎవరు? దేశానికే తలమానికంగా తెలంగాణను తీర్చిదిద్దింది కేసీఆర్ పాలన అని లెకలు సహా కేంద్రం చూపిస్తున్నది. అటువంటి మహానేతను అవమానించడం క్షమించరానిది.
-జూలూరు గౌరీశంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్