నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లోపభూయిష్ట విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ఎస్సారెస్పీ.. దశాబ్దాలుగా ఎన్నడూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. ఎగువ నుంచి వరద వస్తే తప్ప ప్రాజెక్టు నిండని పరిస్థితి! రైతుల పాలిట పేరుగొప్ప ఊరుదిబ్బగా మారిన పోచంపాడు ప్రాజెక్టుకు స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు ‘పునర్జీవం’ పోసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి శ్రీకారంచుట్టి ఇంజినీరింగ్ అద్భుతాన్ని సృష్టించారు. ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌ను నిత్యం నిండుకుండలా ఉంచేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నం సత్ఫలితాలు ఇచ్చింది. ఎండకాలంలో ప్రాజెక్టు అడుగంటినా, వానకాలంలో వానల్లేక బోసిపోయినా ‘పునరుజ్జీవ పథకమే’ ఈ ప్రాజెక్టుకు పునర్వైభవాన్ని తెచ్చింది. ఎగువన మహారాష్ట్ర నుంచి వరద రాకున్నా.. వర్షాలు పడకున్నా కాళేశ్వరం నుంచి ఎదురేగి వచ్చే గోదావరి జలాలు రైతుల్లో భారోసా నింపాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్‌ను బద్నాం చేయాలనే రాజకీయ కుట్రలో భాగంగా కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టును, ప్రతిష్ఠాత్మకమైన ఎస్సారెప్పీ పునర్జీవన పథకాన్ని పక్కనపెట్టింది. ఇప్పుడు సీజన్లో ఆదుకోవాల్సిన ఎస్సారెస్సీ కాస్తా నీళ్లు లేక వెలవెలబోతున్నది. మళ్లీ ఎగువన మహారాష్ట్ర నుంచి వచ్చే వరద కోసం ఆయకట్టు రైతులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నది. కేసీఆర్ హయాంలో తూర్పు నుంచి ఎదురెక్కి వచ్చిన జలాలను చూసి సంబురపడ్డ రైతన్నలంతా.. కాంగ్రెస్ పాలనలో మళ్లీ ‘పశ్చిమ దిక్కుకు దండం’ పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. గత్యంతరం లేక మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ గేట్లు తెరవాలి.. ఎస్సారెస్పీకి వరద రావాలి.. అన్నట్టుగా ఆయకట్టు రైతులకు కాంగ్రెస్ సర్కారు ఎదురుచూపులనే మిగిల్చింది.
రేవంత్ సర్కారు కుట్రపూరిత చర్యల కారణంగా మేడిగడ్డ నుంచి ముప్కాల్ దాకా అనేక పంప్‌హౌస్‌లు, వరద కాలువ నీళ్లు లేక బోసిపోతున్నాయి. జూన్ 20 నాటికి ఎస్సారెస్పీలో 13.978 టీఎంసీల నీరే నిల్వ ఉన్నది. ఎగువ నుంచి 1690 క్యూసెక్కుల స్వల్ప వరద వచ్చి చేరుతున్నది. మే చివర్లో, జూన్ మొదటి వారంలో బాగా కురిసిన వర్షాలు ఇప్పుడు నెమ్మదించాయి. ఆయకట్టు రైతులు మొగులు దిక్కు చూస్తున్నారు. అదే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని వినియోగించి ఉంటే పోచంపాడు నీటి నిల్వను 40 టీఎంసీలకు చేర్చవచ్చు. తద్వారా దిగువ లోయర్ మానేరు డ్యామ్ వరకు లక్షలాది ఎకరాలకు ఊపిరి పోయొచ్చు. వానల కోసం రైతులు ఎదురు చూసే పరిస్థితి లేకుండా చేయవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయట్లేదు. ఎగువ మహారాష్ట్రలో కురిసే భారీ వానలే ఇప్పుడు ఎస్సారెస్పీకి మళ్లీ దిక్కయ్యాయి. గోదావరిపై మహారాష్ట్ర అక్రమంగా నిర్మించిన బాబ్లీ గేట్లు ఎత్తితేనే ఎస్సారెస్పీకి వరద వస్తుంది. జూలై ఒకటిన గేట్లను కేంద్ర జల సంఘం, మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో తెరిస్తే ఒక టీఎంసీ వచ్చే వీలుంది. మహారాష్ట్రలో కురిసే భారీ వానలే మళ్లీ ఎస్సారెస్పీ భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు జలాల ప్రయాణం చరిత్ర సృష్టించింది. పోచంపాడును నింపేందుకు 2023లో కాళేశ్వరం జలాల ఎత్తిపోతలు నిరాటంకంగా కొనసాగాయి. ఈ ప్రక్రియ మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి లక్ష్మీ పంప్‌హౌస్‌లో 6, సరస్వతీ పంప్‌హౌస్‌లో 4, పార్వతీ పంప్‌హౌస్‌లో 4 మోటర్ల చొప్పున నడిపించి కాళేశ్వరం నీటిని ఎల్లంపల్లి జలాశయానికి చేర్చారు. కాళేశ్వరం రెండో లింకులో భాగంగా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌లోకి రెండు మోటర్లతో 6,300 క్యూసెక్కుల కాళేశ్వరం జలాలను వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు తరలించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ శివారులోని పంప్‌హౌస్‌లో 4 మోటర్లు నడిపించి 5,800 క్యూసెక్కుల నీటిని వరద కాలువలోకి ఎత్తిపోశారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా గాయత్రీ పంప్‌హౌస్‌లోని రెండు మోటర్ల ద్వారా 8 వేల క్యూసెక్కుల కాళేశ్వరం నీటిని వరద కాలువ ద్వారా రాంపూర్ పంప్‌హౌస్‌లోకి చేర్చారు. ఇక్కడి నుంచి మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట పంప్‌హౌస్‌కు ఎత్తిపోసి ముప్కాల్ పంప్‌హౌస్‌కు చేర్చారు. ఇక్కడి నుంచి ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి 2023 జూలై 7న కాళేశ్వరం నీటిని భారీ మోటర్లతో ఎత్తిపోశారు.