శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 00:15:29

హింస- పరిష్కారం

హింస- పరిష్కారం

పోరాటం లేకుండా ఏ కోరికా సిద్ధించదని, ఏ కొంతో హింస లేకపోతే ఏ పోరాటమూ ప్రభావం చూపదనే విశ్వాసం హింసాచర్యలు పెచ్చరిల్లడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం- మారిన పరిస్థితులకు అనుగుణంగా మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అవసరమైనంత మేర బాధ్యతాయుత వైఖరిని పెంపొందించుకోకపోవడం. సత్యాగ్రహం లేదా సహాయ నిరాకరణ ప్రభావం చూపనప్పుడు ఆయా వర్గాలకు నిరాశా నిస్పృహల వాతావరణంలో హింసాచర్యలకు దిగడం తప్ప మరోమార్గం ఏదన్నా ఉంటుందా? హింసాచర్యలు ప్రారంభించే వర్గం ఎంత చిన్నదైనా సరే మిగతా సమాజం భయంతోనైనా సరే దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. హింసా చర్యలకున్న గుణమది. ఇలాంటి వైఖరి పెరిగిపోవడానికి కారణమేమై ఉంటుంది? పురాతనమైన సంప్రదాయ విలువలు నశించడం, వాటి స్థానంలో నూతన విలువలు స్థాపించబడకపోవడం. సంఘంలో ఈనాడు జరుగుతున్న మార్పుల దృష్ట్యా నూతన విలువలు రూపొందడం అవసరం. వాటి స్థాపన జరుగవలసి ఉన్నది. పారిశ్రామిక సమాజంలో వ్యక్తి హృదయస్పందన కోల్పోయే స్థితి, ఇలాంటి సమాజంలో వ్యక్తిత్వం నశించి, చొరవలేమిచే భద్రతలేమి వైఖరి పెంపొందడం మొదలైన అనేక విషయాలను, సామూహిక హింస గురించి పరిశీలించే సందర్భంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. అటు సాంఘిక కార్యాచరణలకూ, ఇటు వ్యక్తిగత కార్యాచరణకూ కొన్ని పద్ధతులను నిర్ణయించిన గాంధేయ విధానం ఒక పునాదిగా, మార్క్సిజం మరో పునాదిగా, ఆధునిక సాంఘికశాస్త్రం ఇంకో పునాదిగా పరిశీలించుకుంటే నూతన పద్ధతులనూ, విలువలనూ రూపొందించుకోవడానికి అవకాశముంటుంది. ఇది ఈనాటి ముఖ్యావసరమనేది నిర్వివాదాంశం.


logo