High prices | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): యుద్ధం, ప్రకృతి సంక్షోభ సమయాల్లో కూడా చూడని స్థాయిలో దేశంలో ప్రస్తుతం నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. ఆగస్టు మొదటి వారంలో దాదాపు అన్ని వస్తువుల ధరలు గరిష్ఠానికి చేరుకున్నాయి. కేంద్రం ఇబ్బడిముబ్బడి పన్నుల బాదుడుతో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తో పాటు వంటనూనెలు, బియ్యం, గోధుమ, కందిపప్పు తదితర నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి తాజాగా పెరిగిన కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకటో తేదీన వచ్చిన జీతంలో ముప్పావు వంతు డబ్బు తొలివారంలోనే ఖర్చవుతున్నట్టు వేతన జీవులు గగ్గోలు పెడుతున్నారు.
2 నెలల్లో 200 శాతం పెరుగుదల
వంటనూనె, బియ్యం, గోధుమలు, కందిపప్పు ధరల పెరుగుదలతో కుదేలైన సామాన్యులను కూరగాయలు కూడా భయపెడుతున్నాయి. కూరల్లో ఎక్కువగా వినియోగించే టమాట కిలో మేలో రూ.20కే లభించగా.. ప్రస్తుతం వాటి ధర కిలోకు రూ.250కి చేరింది. పచ్చిమిర్చి, క్యాప్సికం, బీన్స్ తదితర కూరగాయల ధరలు టమాటాతో పోటీపడి పరుగులు తీస్తున్నాయి. అల్లం, ధనియాలు, పచ్చి బఠానీల ధరలు రెట్టింపయ్యాయి. రూ.400కి చేరిన ఎండు మిరపకాయల ధరలు తినకముందే కన్నీళ్లు తెప్పిస్తున్నాయని సామాన్యులు వాపోతున్నారు. మొత్తంగా గడిచిన 3-4 నెలల్లోనే కూరగాయలు, నిత్యావసరాల ధరలు 10 నుంచి 200 శాతం వరకు పెరిగినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
భవిష్యత్తులోనూ తిప్పలు
కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం, పాలసీలు ఘోరంగా విఫలమవుతుండటంతో భవిష్యత్తులోనూ నిత్యావసరాల ధరల ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో దేశంలో పంటల సాగు నెమ్మదించింది. కొన్ని రాష్ర్టాల్లో వర్షాభావ పరిస్థితులు, మరికొన్ని రాష్ర్టాల్లో అతివృష్టితో పంటలు పెద్దయెత్తున దెబ్బతిన్నాయి. దీంతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడవచ్చని నివేదికలు తెలుపుతున్నాయి. సెప్టెంబర్ నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో 5.5 శాతానికి చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ధృవపరుస్తూ రానున్న నెలలో ఉల్లి ధర కిలోకు రూ.70కు చేరొచ్చని క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
గతంలో నెలకు రూ.10 వేల జీతం వచ్చినా.. అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.1,500 మిగిలేది. ఇప్పుడు రూ. 25 వేలు వస్తున్నా.. కొత్తగా అప్పు చేయాల్సి వస్తున్నది.
– ఓ ప్రైవేటు ఉద్యోగి ఆవేదన
మార్కెట్‌కు రూ.100 నోటుతో వెళ్తే గతంలో సంచి నిండా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ.500 తీసుకెళ్లినా.. సగం సంచి కూడా నిండట్లేదు.
– ఓ గృహిణి ఆందోళన
దేశంలోని ప్రతి మధ్యతరగతి జీవి ఆవేదన ఇలాగే ఉన్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ముందుచూపులేని విధానాల వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బీజేపీ తొమ్మిదేండ్ల హయాంలో పేద, మధ్యతరగతి
ప్రజల బతుకు భారంగా మారింది.