Social Media | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణ పనిచేసే మంచి ప్రభుత్వాన్ని కోల్పోయిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాతీర్పును శిరసావహిస్తూనే.. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతోపాటు పార్టీకి వెన్నంటి ఉంటామని పేర్కొంటున్నారు. ఈ మేరకు సోషల్‌మీడియాల్లో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. ఆరునూరైనా గులాబీ జెండా విడిచేది లేదని బీఆర్ఎస్ అభిమానులు తేల్చి చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్ అధినేతతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్‌కు అండగా ఉండాల్సిన బాధ్యత, సమయం ఆసన్నమైందంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
‘తెలంగాణను నిజంగా ప్రేమించే నాలాంటి వారెందరో కలలో కూడా ఊహించని ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలుద్దాం అని రాసుకొచ్చాడు. ‘ప్రజా తీర్పును హుందాగా గౌరవిస్తున్నారు. బాధపడకండి.. మనం తెలంగాణ రాష్ట్ర బాగు కోసం ఎప్పటికీ పోరాడుతూనే ఉందాం. పోరాటాలు, ఉద్యమాలు మనకేం కొత్త కాదు’ అని ఓ నెటిజన్ కేసీఆర్‌కు మద్దతుగా నిలిచాడు. ‘నేటి ఓటమి.. రేపటి గెలుపు.. ఓడిపోయింది అభ్యర్థులే.. అభ్యర్థుల ధైర్యం ఏమాత్రం కాదు..’ అని ఓ యువతి పోస్టు పెట్టింది. ‘నిరంతరం శ్రమతో.. నూతన ఆలోచనలతో నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పుకునే స్థితిలో నిలబెట్టిన నేతకు అండగా ఉండాలి’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘ప్రాణమున్నంత వరకూ గులాబీ జెండా వదిలేదే లేదు. మీరు మీ శాయశక్తులా పోరాడిన తీరు అమోఘం.. నేను చాలా దగ్గరగా మిమ్మల్ని అనుసరించాను.. మీ పనితనం గ్రేట్’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ‘గెలుపోటములు సహజమే అయినా.. ఉద్యమ నాయకులు కేసీఆర్, కేటీఆర్‌కు అండగా ఉండాల్సిన సమయమిది’ అని ఒకరు పోస్ట్ పెట్టి మద్దతుగా నిలిచారు.
రాజకీయాలకతీతంగా చూస్తే భారతదేశంలోనే ఇప్పటివరకూ ఉన్న అత్యుత్తమ ఐటీ మినిస్టర్లలో ఒకరైన కేటీఆర్‌ను కోల్పోయామని దేశాయ్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు. ‘కేటీఆర్‌గారూ..ఇండియాలోనే ఉత్తమమైన ఐటీ మినిస్టర్ సార్ మీరు. మినిస్టర్ల గురించి మాట్లాడాల్సి వస్తే మొదట మీ పేరే వస్తుంది’ అని అన్వేష్ కొండపల్లి అనే యూజర్ పోస్ట్ పెట్టారు. ‘ప్రజా తీర్పును గౌరవిద్దాం.. కానీ ఐటీ మంత్రిగా మిమ్మల్ని తప్ప ఎవరినీ ఊహించుకోలేను. 5 ఏండ్లు మీ వాయిస్ మిస్ అవుతున్నది. మళ్లీ గొప్ప శక్తితో తిరిగి రండి’ అంటూ శ్రీ అక్కి అనే నెటిజన్ కేటీఆర్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. నెటిజన్లందరూ ఐటీ మినిస్టర్ హ్యాష్‌ట్యాగ్‌లతో కేటీఆర్‌కు మద్దతుగా ట్వీట్లు, పోస్టుల వర్షం కురిపించారు.