హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎముకలు కొరికేలా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు గజగజలాడిపోతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ గణనీయంగా పడిపోతుండటంతో పది జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రత 7.8 డిగ్రీలుగా నమోదైనట్టుగా వెల్లడించింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో 8.3, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 8.7, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 8.8 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసినట్టు పేర్కొన్నది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3నుంచి 4డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నదని తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
మరోవైపు మొంథా తుపాను బీభత్సాన్ని మరువక ముందే వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక జారీచేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర తీర ప్రాంతంలో ఈనెల 19 లేదా 20న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. ఈ అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడ్రోజుల్లో తెలంగాణ, ఏపీతో పాటు తమిళనాడు, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.