ప్రభుత్వ ఆదేశంతో నూతన పాలసీపై కసరత్తు రాష్ట్రంలో మద్యాన్ని మరింత ఏరులై పారించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నది. ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నది. అప్పులతో డీలాపడ్డ ఖజానాకు కికెకించేందుకు అదొకటే మార్గమని,ఎలాగైనా ఈ ఏడాది ఎక్సైజ్ ఆదాయాన్ని రూ.60 వేల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది.ఇందుకోసం ఏకంగా కొత్త పాలసీని సిద్ధం చేస్తున్నది.
హైదరాబాద్, జూలై 27 (నమస్తేతెలంగాణ): ఇప్పటి దాకా మేజర్ పంచాయతీల వరకే పరిమితమైన మద్యం దుకాణాలను పల్లెలకు విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ముందస్తుగా నోటిఫికేషన్ ఇవ్వడం, దుకాణాలను రాష్ర్టేతరులకు అప్పగించడం తదితర అంశాలతో ఎక్సైజ్ అధికారులు కొత్త పాలసీని రూపొందిస్తున్నట్టు సమాచారం. కొత్త పాలసీ ఎలా ఉండాలనే దానిపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఉన్నతాధికారులకు సూచనలు ఇచ్చినట్టు సమాచారం. దీనికి అనుగుణంగా ఎక్సైజ్ కమిషనర్ హరికిషన్ క్షేత్రస్థాయి అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరినట్టు తెలిసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ పాలసీ నవంబర్ 30తో ముగియనున్నది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పాలసీ అమల్లోకి రావాల్సి ఉన్నది.
సాధారణంగా పాలసీ గడువు ముగిసే 15 రోజుల ముందు కొత్త పాలసీకి నోటిఫికేషన్ ఇస్తుంటారు. కానీ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మద్యం టెండర్ల నోటిఫికేషన్ ఇవ్వడం కుదరదు కాబట్టి ఆగస్టు రెండు లేదా మూడో వారంలో టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ ఏడాది అంచ నా కంటే తకువ మద్యం విక్రయాలు జరిగిన దుకాణాలను గుర్తించి, వాటిని మండల నుంచి గ్రామాల పరిధిలోకి విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. స్థాన చలనం చేసే దుకాణాలకు జనాభాను ప్రతిపదికన కాకుం డా మద్యం విక్రయాలస్థాయిని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.
మూడేండ్లకు పెంపు.. పెద్ద స్కెచ్
ప్రస్తుతం ఏ4 దుకాణాల లైసెన్స్ గడువు రెండేండ్లు ఉన్నది. కొత్త పాలసీలో ఈ గడువు 3 సంవత్సరాలకు పెంచాలని, దరఖాస్తు ధరను రూ.3 లక్షలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గడువు పెంపు వెనుక భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తున్నది. మూడేండ్ల ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చి 2028 నవంబర్‌తో ముగుస్తుంది. 2028 ఆగస్టు నెలలో మరోసారి మూడేండ్ల గడువుతో నోటిఫికేషన్ వేసి, లైసెన్స్ ఫీజులు వసూలు చేసి, కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. తద్వారా 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందే భారీగా నిధులు ‘చేతి’కి వస్తాయని భావిస్తున్నారట.
రిజర్వేషన్లు రాష్ర్టేతరులకూ వర్తింపు
ప్రస్తుతం రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, గౌడలకు కేటాయిస్తున్న దుకాణాల దరఖాస్తులకు అర్హతను రాష్ర్టేతరులకు కూడా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. తద్వారా పొరుగు రాష్ర్టాల నుంచి 30 వేల వరకు అదనపు దరఖాస్తులు వస్తాయని, ఆ మేరకు అదనంగా ఖజానాకు నిధులు చేరుతాయని అంచనా వేస్తున్నట్టు సమాచారం. త్వరలో ముఖ్యమంత్రితో జరగబోయే సమీక్షలో ఈ ప్రతిపాదనలకు మెరుగులు దిద్ది, తు దిరూపు ఇస్తారని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.
24 గంటలు అమ్మితేనే..
వ్యాట్ ద్వారా ఈ ఏడాది రూ.26,570 వేల కోట్లు, అబారీ రెవెన్యూ ద్వారా రూ.27,623 కోట్లు కలిపి మొత్తంగా రూ.54,193 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. 2023-24లో వచ్చిన ఆదాయాన్ని బట్టి తెలంగాణలో ఒకో వ్యక్తి సగటున మద్యం కోసం రూ.897 చొప్పున ఖర్చు చేశారని, గత ఏడాది ఆ సగటు రూ.1,623కు పెరిగిందని, వచ్చే ఏడాది ప్రభుత్వ అంచనాలు అందుకోవాలంటే సగటు ఖర్చు రూ.2,956కు పెంచితే తప్ప సాధ్యం కాదని ఎక్సైజ్ అధికారి ఒకరు విశ్లేషించారు. గల్లీకో రెండు మూడు బెల్టు దుకాణాలు పెట్టించి, 24 గంటలు మద్యం అమ్మించగలిగితేనే ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌ను అందుకోగలమని ఆ అధికారి అభిప్రాయపడ్డారు.