న్యూస్ నెట్వర్క్, మే 4 : రాష్ట్రంలో కురిసిన అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన ధాన్యం తడిసిముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోతుంటే రైతాంగం గుండె చలించింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోగా, మామిడికాయలు, మక్కజొన్న నేలరాలాయి. పిడుగుపాటుకు 63 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో వరి ధాన్యం తడిసిపోగా, మామిడికాయలు నేలరాలాయి. జగిత్యాల జిల్లా మల్యాల మం డలం బల్వంతాపూర్‌లో పిడుగు పడి 42 గొర్రెలు మృతి చెందాయి. వేల్పుల రామచంద్రం, మహేశ్ అనే ఇద్దరు గొర్రెల కాపర్లకు, భూమి యజమాని రాజేశ్‌కు గాయాలయ్యాయి.
ఉమ్మడి వరంగల్ ఎల్కతుర్తి మండలంలో సుమారు 200 ఎకరాల వరి పంట నేలకొరిగినట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వరి, మామిడి పంటల నష్టంపై సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండజిల్లాలో పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పద్మశాలి గడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని నర్లెంగగడ్డకు చెందిన రైతు చౌడు పోచయ్య పిడుగుపాటుకు మృతిచెందగా, మరో రైతు తీవ్రంగా గాయపడ్డాడు.
మిరుదొడ్డిలో బర్రె, లక్ష్మీనగర్‌లో ఎద్దు, మద్దూరు మండలంలోని వంగపల్లి, నర్సాయపల్లి గ్రామాల్లో రెండు కాడెద్దులు, ఒక ఆవు మృతిచెందాయి. ధూళిమిట్ట మండలం బెక్కల్‌లో విద్యుదాఘాతంతో మూడు గొర్రెలు, ఒక మేక మృతిచెందగా రాజలింగం అనే వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం మల్లుపల్లికి చెందిన కేతావత్ విఠల్‌కు చెందిన రెండు బర్రెలు పిడుగుపాటుకు మృతి చెందాయి. యాదగిరిగుట్టలో 79.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. యాదాద్రిలో వైకుంఠ పాదం వైపుగా వెళ్లే రహదారి కుంగిపోయింది. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. యాదాద్రి కొండపైన చలువ పందిళ్లు కూలిపోయాయి. రాజపేట మండలం జాల గ్రామంలో పిడుగుపాటుకు బర్రె, మోత్కూరు మండలం దాచారంలో పది గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రాష్టంలో అత్యధికంగా సిద్దిపేట జిల్లా అబ్సిపూర్లో 11.5 సెం.మీ వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా పజ్జూర్ 9.80 సెం.మీ., కామారెడ్డిగూడెం 9.30సెం.మీ., నెమ్మాని 8.80సెం.మీ., హైదరాబాద్ సీతాఫల్‌మండీ 8.68సెం.మీ., యాదగిరిగుట్ట 8.35 సెం.మీ. వర్షం కురిసినట్టు టీఎస్‌డీపీఎస్ తెలిపింది.