కోల్‌సిటీ/కూసుమంచి (నేలకొండపల్లి), మార్చి 25: ఆరు గ్యారెంటీలను అమలు చేయమని అడిగితే అరెస్టులు చేస్తరా? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇంకా ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. మంగళవారం ఆయన గోదావరిఖని చేరుకున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని, పట్టణ సమస్యలు తీర్చాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. అంతకు ముందు జాన్వెస్లీకి ఎన్టీపీసీ వద్ద ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీగా గోదావరిఖనికి చేరుకొని అంబేద్కర్, మహాత్మాజ్యోతిరావు ఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ధర్నాలో ఆయన మాట్లాడారు. భూపోరాటం ద్వారా ఇండ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని కోరారు.
ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు తమ ఉద్యోగ భద్రత కోసం ఉద్యమిస్తుంటే, అక్రమంగా అరెస్టులు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్, జిల్లా నాయకుడు ఎర్రా శ్రీనివాసరావు, మండల కార్యదర్శి కేవీ రాంరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గుడవర్తి నాగేశ్వరరావు, ఎస్కే బషీర్, రచ్చా నర్సింహారావు, బెల్లం లక్ష్మి, నాగేశ్వరరావు, దండా సూర్యనారాయణ, బలుపు ప్రమీల, కొండల్రావు, కనమయ్య పాల్గొన్నారు.