అభివృద్ధి పనులకు అన్నిరకాలా సాయం
మంత్రి కేటీఆర్‌తో ఆర్మీ అధికారుల వెల్లడి
కంటోన్మెంట్లో రోడ్ల మూసివేతపై చర్చలు
త్వరలోనే సంయుక్త పర్యవేక్షణ కమిటీ
సికింద్రాబాద్, ఏప్రిల్ 5: కంటోన్మెంట్ ప్రాంతం చుట్టుపక్కల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకొంటామని ఆర్మీ ఉన్నతాధికారులు మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావుకు హామీ ఇచ్చారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టే అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి పనిచేస్తామని తెలిపారు. లెఫ్టినెంట్ జనరల్ అరుణ్, జనరల్ ఆఫీసర్ కమాండింగ్, కంటోన్మెంట్ బోర్డు బ్రిగేడియర్ సోమశంకర్ తదితరులు కేటీఆర్‌తో మంగళవారం సమావేశమై కంటోన్మెంట్లో రోడ్ల మూసివేత, ఇతర సమస్యలపై చర్చించారు. నానక్‌రామ్‌గూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మెహిదీపట్నం కంటోన్మెంట్ ఏరియాలో బల్కాపూర్ వరద నాలా విస్తరణ, మెహిదీపట్నం చౌరాస్తాలో స్కైవాక్ నిర్మాణం, గోల్కొండ గోల్ఫ్ కోర్స్, డాలర్ హిల్స్ మీదుగా నెక్నామ్పూర్ వైపు లింకు రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు.
అభివృద్ధికి సహకరించండి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరం నలుదిక్కులా భారీ రోడ్ల నిర్మాణం, విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్నామని, ఆర్మీ ప్రాంతాల్లో సైతం మౌలిక వసతుల కల్పన జరిగిందని చెప్పారు. కొన్ని పనుల విషయంలో రక్షణ శాఖ మంత్రి, ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా సానుకూల స్పందన రాలేదని వివరించారు. కంటోన్మెంట్లో పదేపదే రోడ్లు మూసివేయడంతో మల్కాజిగిరి లాంటి ప్రాంతాల పౌరులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఆర్మీకి సంబంధించిన ప్రతి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవప్రదమైన దృక్పథంతో ముందుకుపోతున్నదని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆర్మీ అధికారులు తెలిపారు. రోడ్ల మూసివేతపై త్వరలోనే కంటోన్మెంట్, జీహెచ్ఎంసీ అధికారులతో సంయుక్త పర్యవేక్షణ కమిటీ వేయాలని నిర్ణయించారు. లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ బృందాన్ని మంత్రి కేటీఆర్ శాలువాలు కప్పి సత్కరించారు. సమావేశంలో ఆర్మీ ఉన్నతాధికారులతోపాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు, పురపాలకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ పాల్గొన్నారు.