Irrigation Water | నర్సంపేట, జనవరి 17: కాంగ్రెస్ ప్రభుత్వంలో యాసంగి పంటల సాగుకు నీళ్లు వస్తాయా? రావా? అని రైతులు అనుమానిస్తున్నారని, నీటి విడుదలపై కాంగ్రెస్ నాయకులు, అధికారుల ప్రకటనతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నర్సంపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతులు గోదావరి జలాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ సర్కార్ నియోజక వర్గంలో మూడు, నాలుగేండ్లుగా ఇరిగేషన్ సర్క్యూట్ ప్లాన్ ప్రకారం గోదావరి జలాలను తీసుకుని వచ్చి రెండు పంటలకు సమృద్ధిగా నీరందించిందని పేర్కొన్నారు.
ప్రత్యేకమైన ఏజెన్సీ పెట్టుకుని సమగ్రమైన ప్రణాళిక ద్వారా పంటల సాగుకు గోదావరి జలాలను తీసుకుని వచ్చినట్టు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సాగునీటిపై ఒక్కసారైనా అధికారులతో సమీక్షించారా? అని ప్రశ్నించారు. గతంలో పూడుకుపోయిన డీబీఎం 38,40,48వ కాల్వలను పునర్నిర్మించి, కాకతీయ కాలువపై క్రాస్ రెగ్యులేటరీ నిర్మాణం చేయించి సమృద్ధిగా నీరందించి పంటల సాగుకు కృషి చేసినట్టు తెలిపారు.