ఆదిలాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో పత్తి దిగుబడులు ప్రారంభమైనా.. కొనుగోళ్లు ప్రారంభంకాలే దు. దీంతో రైతులు చేతికొచ్చిన పంటను నిల్వ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 23న పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తున్నామని ప్రకటించిన అధికారులు ఆ తరువాత వాయిదా వేశారు. దిగుబడులు ప్రారంభమై పది రోజులు దాటినా కొనుగోళ్లు లేకపోవడంతో పత్తిని గ్రామంలో ఆరు బయట ని ల్వ ఉంచుతున్నారు. రాత్రీపగలు రైతులు కాపలా ఉంటున్నారు. వర్షాలు కురుస్తుండటంతో పంట తడిసి నష్టపోకుండా ప్లాస్టిక్ కవర్లు కప్పుతున్నారు. సీసీఐ కొనుగోళ్లు లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి దళారులు వచ్చి పత్తిని తక్కువ ధరకు అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పత్తిని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నారాయణపేట జిల్లా ధన్వాడలోని రైతువేదిక ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రం లేక దళారులు పంటను తక్కువ ధరకు తీసుకోవడంతోపాటు తూకాల్లో మోసం చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.