హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ‘నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్‌రెడ్డితో సహా ఇతర కాంగ్రెస్ పెద్దలకు.. విషం చిమ్మేలా కనిపించిన ఫార్మా కంపెనీలు, నేడు సువాసన వెదజల్లే కంపెనీలుగా కనిపిస్తున్నయా?’ అని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నిలదీసింది. ఈ మేరకు ఆదివారం పలువురు రైతులతో కూడిన కమిటీ ప్రకటన విడుదల చేసింది. ‘నాడు ఫార్మా అంటేనే భూతం, ఒక సిరీస్ కంపెనీతోనే 30 ఏండ్ల తర్వాత కూడా కాలుష్యం పోలేదు. ఫార్మాసిటీకి భూములు ఇవ్వొద్దు. మేం అధికారంలోకి వస్తే ఫార్మా రద్దు, భూసేకరణ రద్దు’ అని చెప్పారని, నేడు అదే ఫార్మాసిటీ కోసం రైతుల భూములు గుంజుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది.
‘కాలుష్యంతో ఎంతోమంది ప్రాణాలు బలితీసుకున్న అరబిందో, డాక్టర్ రెడ్డీస్ వంటి క్రిమినల్ కంపెనీలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు’ అని మండిపడింది. ‘ఎటు కుదిరితే అటు మాట్లాడటం కాంగ్రెస్ నాయకులకు అలవాటైంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఎన్ని లేఖలు రాసినా వారికి రైతులు కనిపించటం లేదు. ఒకప్పుడు పిలవకున్నా వచ్చి మా ఊర్లలో తిరిగిన కాంగ్రెస్ నాయకులు, ఈ రోజు భూతద్దంతో వెతికినా కనిపించటం లేదు’ అని దుయ్యబట్టింది.
‘ఆ రోజు రైతుల పాదయాత్రలో వచ్చిన మల్రెడ్డి రంగారెడ్డి.. రైతుల భూముల కోసం ఎన్ని పోరాటాలైనా చేస్తానని మాటిచ్చిండు.. ఇప్పుడు మాగోడు వినేవారే లేకుండా పోయిండ్రు.. నాడు ఎన్నికలప్పుడు మల్రెడ్డి రంగారెడ్డికి ఓటు వేయాలని చెప్పిన ముదిరెడ్డి కోదండరెడ్డి.. ఇప్పుడు మా తరఫున పోరాటం చెయ్యాలని అడిగితే సమాధానం చెప్తలేడు.. ఇప్పుడు తనకేం సంబంధం లేదంటున్నడు. ప్రభుత్వం మాటమార్చి ఫార్మాసిటీ రద్దు చేయలేదని కోర్టులో ఒప్పుకొన్న తర్వాత కూడా ఆయన మా గురించి ఒక్క మాట కూడా మాట్లాడ్తలేడు’ అని కమిటీ రైతులు పేర్కొన్నారు.
నిజంగా ప్రజల కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనిచేస్తుంటే ఫార్మాసిటీని, దాని కోసం చేస్తున్న భూసేకరణను తక్షణం రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ తమతో కలిసిరావాలని కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ విధంగా అయితే ఫార్మా విలేజ్‌ని రద్దు చెయ్యిమంటున్నారో అదేవిధంగా యాచారం ప్రాంతంలో ఫార్మాసిటీని కూడా రద్దు చేసేలా బీజేపీ నాయకులు ఒత్తిడి తేవాలని కవుల సరస్వతి, కేస్దాస్ పసుల కాపరి, సమ నిరంజన్, కనేమోని గణేశ్, మర్రి భగవంతరెడ్డి, ముత్యాల మహిపాల్‌రెడ్డి, కల్లు కొండలరెడ్డి, అద్దేకర్ దేవోజీ, పాడి రైతు సోమయ్య, బొద్దు సందీప్‌రెడ్డి, ఆరేపల్లి లింగం, జకుల వెంకటేశ్, విస్లావత్ శంకర్, కే పాండురంగాచారి కోరారు.
ఒకప్పుడు దొరల వద్ద బానిసలుగా బతుకున్న ప్రజలకు ఇందిరా గాంధీ.. భూములు పంచారని, ఈ రోజు ఆమె పేరు చెప్పుకొని రాజకీయ లబ్ధి పొందుతున్న నాయకులు, అవే భూములను లాకొని కార్పొరేట్ దొరలకు ముట్టజెప్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల ముందు.. ఇందిరా గాంధీ ఇచ్చిన భూములు అన్యాయంగా, అక్రమంగా గుంజుకున్నారని రైతుల పక్షాన మాట్లాడిన కాంగ్రెస్ పెద్దలు.. ఇప్పుడు ఇవ్వని భూములు కూడా గుంజుకుందామని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొడంగల్ ఘటన తర్వాత బీజేపీ నాయకులు కూడా సుద్ద పూసల్లాగ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.