సిద్దిపేట : కొత్త కాలనీల ఏర్పాటుతో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం సహజమే. ఆయా కాలనీల్లో మౌలిక వసతులను దశల వారీగా కల్పిస్తూ.. టీహెచ్ఆర్ కాలనీ అభివృద్ధికి సహకరిస్తానని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
ఆదివారం సిద్దిపేట పట్టణంలోని టీహెచ్ఆర్ నగర్, ముత్యాల పోచమ్మ, శ్రీనగర్ రేణుకా ఎల్లమ్మ, మోహినిపురా, దీకొండ మైసమ్మ, కాళ్లకుంట కాలనీ మైసమ్మ, నర్సాపూర్-కేసీఆర్ నగర్, నల్ల పోచమ్మ, మాంకాళమ్మ, సౌడాలమ్మ ఆలయాలలో బోనాల పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు.

ఈ మేరకు ఆయా కాలనీల్లోని బోనాల ఉత్సవాలకు మంత్రి హరీశ్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవార్లను కోరినట్లు మంత్రి తెలిపారు.
అలాగే టీహెచ్ఆర్ నగర్ కాలనీలో యూజీడీ, సీసీరోడ్లు, రేషన్ షాపు ఏర్పాటు చేయిస్తానని హామీనిచ్చారు. త్వరితగతిన పూర్తి అయ్యేలా చొరవ చూపుతానని, దశల వారీగా కొత్త కాలనీల అభివృద్ధికి సహకరిస్తానని మంత్రి తెలిపారు.