ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. కేవలం కార్పొరేట్ శక్తులకే ఈ బడ్జెట్ అనుకూలంగా వుందని అన్నారు. అయితే కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను సీపీఐ నేత నారాయణ గట్టిగా సమర్థించారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు సరైనవేనని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, ఈ పోరాటంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాము మద్దతు ప్రకటిస్తామని నారాయణ వెల్లడించారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో కూడా టీఆర్ఎస్ను కలుపుకొనే వెళ్తామని ప్రకటించారు.
సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన కమ్యూనిస్టు నేతలు
గత నెల జనవరిలో సీపీఐ, సీపీఎం నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో విడివిడిగా ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేయాల్సిన అవసరం ఎంతైనా వుందని సీఎం కేసీఆర్ వామపక్ష నేతలతో స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీలు ఇందుకు చొరవ తీసుకోవాలని, తాము కూడా ఇందుకు మద్దతిస్తామని సీఎం కేసీఆర్ వామపక్ష నేతలతో అన్నారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా కూడా కమ్యూనిస్టు పార్టీలు చూడాలని సీఎం కేసీఆర్ ఈ భేటీ సందర్భంగా కోరారు.