సాంచా సప్పుళ్లతో సిరులు పొంగిన నేల.. ఇప్పుడు ఉరితాడు ముందు ఊగిసలాడుతున్నది. బంగారు వర్ణాల చీరలతో మెరిసిన మరమగ్గాలు.. ఇప్పుడు తుక్కు కింద తూకమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో జరీపోగై నవ్విన నేతన్న.. ఇప్పుడు ఆదుకునేవారు లేక రోడ్డునపడ్డాడు. ఏటా రూ.350 కోట్ల విలువైన వస్త్ర ఆర్డర్లతో చేతినిండా పనితో వెలుగు వెలిగిన సిరిసిల్లలో ఇప్పుడు 30వేల సాంచాలు మూలనపడ్డాయి. ఇనుప సామాన్ల షాపునకు తరలిపోతున్నాయి. ఇప్పటికే 500 సాంచాలు స్క్రాప్ కింద అమ్మేశారు. సిరిసిల్లలో ఇప్పుడిది రోజూ కనిపిస్తున్న దృశ్యం. బతికిచెడిన చేనేత పరిశ్రమ దుస్థితికి నిలువెత్తు సాక్ష్యం.
Sircilla | రాజన్న సిరిసిల్ల, జూన్ 13 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల సాంచాలకు సావొచ్చింది. వస్ర్తాల ఉత్పత్తితో ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తానన్న మంత్రి పొన్నం హామీ అటకెక్కింది. కరుణించని సర్కారుతో బతుకు మారక నేతన్న ఉపాధికి మళ్లీ వలస బాటపట్టాల్సి వస్తున్నది. ఆర్డర్లు లేక ఇప్పటికే 500 సాంచాలను తుక్కుగా అమ్మేశారు. సంక్షోభంలోకి కూరుకుపోతున్న వస్త్ర పరిశ్రమతో సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్ల అవుతుందా..? అన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో జరిపోగులై మెరిసిన సాంచాలు కాంగ్రెస్ పాలనలో ఇనుప సామాన్లకు అమ్ముకునే దుస్థితి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్లకు కేసీఆర్ ప్రభుత్వం చేయూతనిచ్చింది. నేతన్నల తలరాతలు మార్చింది. సర్కారు చేయూతతో ఆత్మహత్యలు, ఆకలిచావులు లేకుండా చేసింది. పదేండ్లలో ఏటా రూ.350 కోట్ల వస్త్ర ఆర్డర్లతో చేతి నిండా పని కల్పించారు. థ్రిప్టు, బీమా, యార్న్ సబ్సిడీ వంటి పథకాల అమలుతో నేతన్నలు గౌరవంగా బతికారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేసింది. దీంతో నేతన్నలు మళ్లీ రోడ్డున పడ్డారు. సిరిసిల్లలోని 30 వేల సాంచాలు మూలనపడ్డాయి. గత సర్కారు కన్నా మెరుగైన వస్త్ర ఉత్పత్తులతో ఏడాది పొడవునా పని కల్పిస్తామని పార్లమెంటు ఎన్నికల ముందు రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్లలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఆర్డర్లు ఇవ్వలేకపోయామని చెప్పుకొచ్చారు. కానీ, ఇచ్చిన హామీ నేటి వరకు అమలు కాలేదు.
రాష్ట ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలపై సవతి ప్రేమ చూపుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్డర్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రూ.34 లక్షల విలువగల సర్వశిక్ష అభియాన్ వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇచ్చిన ఆర్డర్లతో వెయ్యి మందికి కూడా ఉపాధి లభించలేదని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీ, సింగరేణి ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన వస్త్ర ఆర్డర్లు సిరిసిల్లకే ఇస్తామని చెప్పి ఊసెత్తడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేతన్నలు పనిలేక, కుటుంబ పోషణ భారమై భీవండి, సూరత్‌కు వలస బాటపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం సాంచాలకు కరెంటు కోసం యూనిట్‌కు రెండు రూపాయల సబ్సిడీ ఇచ్చింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం యూనిట్‌కు రూ.8.50లు వసూలు చేస్తూ ఆసాములపై పెనుభారం మోపింది. కరెంటు బిల్లులు చెల్లించలేక ఆసాములు సాంచాలు పగులగొట్టి స్క్రాప్‌కు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే 500ల సాంచాలు తుక్కుకింద అమ్ముకున్నారు. వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు రూ.350 కోట్లలో రూ.150 కోట్లు మాత్రమే విడుదల చేసింది. కార్మికులకు రావాల్సిన నూలు సబ్సిడీ పైసలూ ఇవ్వలేదు. గత ప్రభు త్వ పథకాలన్నీ నిలిపివేయడంతో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం వస్త్ర ఆర్డర్లు ఇ చ్చి అండగా నిలువాలని కార్మికులు కోరుతున్నారు.
మెరుగైన వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లతో ఏ డాది పొడవునా పనికల్పిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ అమలు చె య్యాలి. పదికోట్ల మీటర్ల వస్త్ర ఆర్డర్లు ఇస్తే తప్ప సాంచాలు నడవని పరిస్థితి ఉంది. యజమానులకు, ఆసాములకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలి. కేసీఆర్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేయాలి. వర్కర్ టు ఓనర్ పథకం వెంటనే ప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్ల అయ్యే ప్రమాదం ఉంది.