హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): తమ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగించటంలేదని బీఆర్ఎస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఫార్మాసిటీ కోసం ముచ్చర్ల సహా పలు గ్రామాల్లో దాదాపు 12 వేల ఎకరాలు సేకరించామని చెప్పారు. శాసనసభలో పద్దులపై మంగళవారం జరిగిన చర్చలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ ఫార్మాసిటీని రద్దు చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పలుమార్లు ప్రకటించిందని, రద్దు చేస్తే రైతులకు వారి భూములను ఎప్పుడు తిరిగిస్తరో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోదండరెడ్డి ఫార్మాసిటీ భూములను రైతులకు తిరిగిస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. మూసీనది సుందరీకరణలో కీలకమైన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను తమ ప్రభుత్వం వందశాతం పూర్తిచేసిందని చెప్పారు. మూసీ సుందరీకరణకు రూ.16 వేల కోట్లతో తమ ప్రభుత్వమే డిజైన్లు కూడా పూర్తి చేసిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసీ సుందరీకరణకు రూ.50 వేల కోట్లు అని ఒక మంత్రి అంటే, పర్యాటక శాఖ మంత్రి రూ.75 వేల కోట్లు అని చెప్పారని, ఇటీవల గోపన్‌పల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి ఏకంగా లక్షా 50 వేల కోట్లు అని పేర్కొన్నారని సభదృష్టికి తెచ్చారు. రూ.16 వేలకోట్లతో ఈస్ట్, వెస్ట్ ఎక్స్‌ప్రెస్ హైవేతో పాటు మూసీ సుందరీకరణ పూర్తికి తమ ప్రభుత్వం అన్నీ సిద్ధం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు ఖర్చును ఏకంగా లక్షా50 వేల కోట్లకు ఎందుకు పెరిగిందో చెప్పాలని, డీపీఆర్‌ను ప్రజల ముందుపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో ఎస్సార్డీపీ, ఎస్ఎన్డీపీ ప్రాజెక్టుల పనులు పూర్తిగా నిలిచిపోయాయని, ఎనిమిది నెలలుగా ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిల నిర్మాణం ఆపేశారని, బిల్లులు చెల్లించకపోవటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, వెంటనే బిల్లులు చెల్లించి పనులు పూర్తి చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎలివేటెడ్ కారిడార్లు పూర్తి చేస్తామని ఘనంగా ప్రచారం చేసుకుంటున్న ఈ ప్రభుత్వం, హెచ్ఎమ్డీఏకు బడ్జెట్లో కేవలం రూ.700 కోట్లే కేటాయించిందని, రూ.5 వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టులను ఈ నిధులతో ఎలా పూర్తిచేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.