Panchayati Elections | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జూలైలో అయినా జరుగుతాయా అనే అనుమానం కలుగుతున్నది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చి 15 నెలలైనా రిజర్వేషన్ల ప్రక్రియను రేవంత్ సర్కారు కొలిక్కి తీసుకురాలేకపోయింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన వివిధ అభివృద్ధి నిధులు నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామీణ సంక్షేమానికి తీవ్ర విఘాతం కలుగుతున్నది.
గ్రామాల్లో నిధుల కొరత..
రాష్ట్రంలో గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం ఇప్పటికే ముగిసింది. నిరుడు ఫిబ్రవరి 1న సర్పంచుల పదవీకాలం ముగిసింది. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. ఆర్టికల్ 243ఈ(3)ప్రకారం.. ప్రతి ఐదేండ్లకు ఒకసారి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. గ్రామపంచాయతీ పాలకవర్గం గడువు ముగిసేలోపు లేదా పాలకవర్గం రద్దయిన ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తిచేయాలి. కానీ, గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసి 14 నెలలు కావస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంపై కేంద్ర పంచాయతీరాజ్ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తాజాగా ఆందోళన వ్యక్తంచేసింది. ఎన్నికల ఆలస్యంతో గ్రామాభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు నిలిచిపోయాయని తెలిపింది.
బీసీల రిజర్వేషన్‌పై మల్లగుల్లాలు
కులగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రకటించింది. ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కుల సర్వే నిర్వహించింది. గణాంకాలను అసెంబ్లీలో ప్రకటించింది. 3.1 శాతం(16 లక్షల) జనాభా సర్వేలో పాల్గొనలేదని వెల్లడించింది. సర్వే గణాంకాలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తోపాటు బీజేపీ, ప్రజాసంఘాలు, కుల సంఘాలు, మేధావులు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. రీ సర్వేకు డిమాండ్ చేశారు. దీంతో సర్కారు ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మళ్లీ కులగణన వివరాల నమోదుకు అవకాశం కల్పించింది. 15 వేల లోపు కుటుంబాల వివరాలు మాత్రమే సేకరించగలిగింది. ఈ గణాంకాలపై ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అప్పుడే 42 శాతం రిజర్వేషన్లపై బిల్లు పెడతామని, పార్లమెంట్లో ఆమోదం కోసం పంపిస్తామని చేతులు దులుపుకున్నది.