MLC Kavitha | నిజామాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కేసీఆర్ బిడ్డలమైన రామన్న మీద, నా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాది భయపడే బ్లడ్ కాదు. భయపెట్టే బ్లడ్..’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనైనా మేమెవ్వరికీ భయపడేది లేదు. మేము తప్పు చేయలేదు. నామీద, రామన్న మీద, బీఆర్ఎస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా.. నిప్పు కణికల్లా బయటికి వస్తాం..’ అంటూ స్పష్టంచేశారు. ‘ఎందుకు అయితున్నయి కేసులు ఇయ్యాలా? కేంద్రాన్ని ఎదురించి మాట్లాడితే కేసు. చైనా వాడు బార్డర్ దాటి లోపలికి వచ్చిండంటే కేసు. ప్రజలకు మంచి జరుగతలేదంటే కేసు. ముఖ్యమంత్రి పేరు మరిచిపోతే కేసు, రైతు తన భూమి ఇయ్యకపోతే కేసు, ఫేస్బుక్లో పోస్టు పెడితే కేసు, ట్విట్టర్లో ప్రొఫెసర్లు అభిప్రాయం చెప్తే కేసు, ఇన్‌స్టాలో అక్కాచెల్లెళ్లు వీడియో పెడితే కేసు..’ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును కవిత ఎండగట్టారు. ముఖ్యమంత్రికి గింత భయమెందుకు? నిజాన్ని ఫేస్ చేయలేరా? అని ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్‌పై విడుదలైన అనంతరం నిజామాబాద్ జిల్లాకు తొలిసారిగా ఆదివారం కవిత వచ్చారు. ఈ సందర్భంగా 44వ నంబర్ జాతీయ రహదారి ఇందల్వాయి టోల్‌ప్లాజా దగ్గరి నుంచి నిజామాబాద్ నగరం వరకు కవితకు ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ శ్రేణులు, భారత జాగృతి నాయకులు, కవిత అభిమానులు దారి పొడవునా అపూర్వ స్వాగతం పలికారు. సుభాష్‌నగర్‌లోని ఉద్యమకాలం నాటి తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘బరువు ఎత్తుకున్నోడు.. బాధ్యత ఉన్నోడు. ఓపికతో ఉండాలె. ప్రజలకు ఇబ్బంది ఉంటే పరిష్కారం చేస్తావనే బాధ్యత ఇచ్చారు. అల్లాటప్పాగా టైం పాస్‌కు అధికారం ఇయ్యరు. ఆ విషయాన్ని మరిచిపోయి ఎదురు మాట్లాడితే కేసులు పెడుతున్నరు’ అని కవిత మండిపడ్డారు.
కేసులు మమ్మల్ని భయపెట్టలేవు. ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చినోళ్లం. గులాబీ పార్టీ వాళ్లం. గట్టిగా నిలబడతాం. ప్రజల పక్షాన కొట్లాడుతాం.
-ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను అని, పిడికిలి ఎత్తి అన్నీ ఎదురించి ఇక్కడికి వచ్చానంటూ ఎమ్మెల్సీ కవిత చెప్పారు. కష్టకాలంలో తనకు మద్దతు ఇచ్చినందుకు ప్రజలందరికీ వేదిక పైనుంచి భావోద్వేగంతో ధన్యవాదాలు తెలియజేశారు. సుభాష్‌నగర్‌లో తెలంగాణతల్లి విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన సభా ప్రాంగణానికి బతుకమ్మ, బోనాలు, గొంగడి, వలలు, గొర్రె పిల్లలతో భారీగా తరలి వచ్చిన అభిమానులను చూసి కవిత మురిసిపోయారు. దసరా లెక్క అనిపిస్తున్నదని, మిట్ట మధ్యాహ్నం ఎండ కొడుతుంటే వెన్నెల్లో నిల్చున్నట్టు, నవ్వుతుంటే మనసు పులకరిస్తున్నదని చెప్పారు. డిగ్రీ చదివినవారు పెద్ద సంఖ్యలో ఈ సభకు రాగా వారిని ఉద్దేశించి స్కూటీలు వచ్చాయా? అని కవిత ప్రశ్నించారు. రాలేదంటూ వారంతా చేతులు ఊపారు.
ముఖ్యమంత్రికి తెలిసేలా చెప్పండి అని అనగానే రాలేదంటూ కేకలు వేశారు. తులం బంగారం వచ్చిందా? అని మహిళలను ప్రశ్నించగా రాలేదంటూ చేతులు ఊపారు. రూ.2,500 వచ్చినయా? మహాలక్ష్మి స్కీం వచ్చిందా? అంటే ఏమీ లేదంటూ మహిళా లోకం స్పందించింది. ఎన్నికల్లో మనసుకు ఏది వస్తే అది చెప్పారని, ఇప్పుడు ఏ ఒక్కటీ చేస్త్తలేరని మండిపడ్డారు. షాదీముబారక్‌లో రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామన్నారని, ఇప్పటివరకు ఏడాదికాలంగా కేసీఆర్ పైసలే ఇస్తున్నారని తెలిపారు. ఎన్నికలప్పుడు వచ్చే నెలలోనే ఇస్తామని చప్పి ఇంతవరకు రూ.4వేలు పింఛన్ అమలు చేయట్లేదని దుయ్యబట్టారు.
కేసీఆర్ ఉన్నప్పుడేమో పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండేదని, ఇప్పుడేమో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసులయ్యారని కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏకంగా పోలీసులను కొట్టినోళ్లను జగిత్యాల ఠాణా నుంచి తీసుకుని పోయారని చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ జులుం నడుస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో నడిచిన మంచి పథకాలు కొనసాగించాలని కాంగ్రెస్ సర్కారును కవిత డిమాండ్ చేశారు. ‘రైతుభరోసా ఎగ్గొట్టారు. రుణమాఫీ చేసినం అంటున్నరు. మనకు రాలేదు. పక్క ఇంటోడికీ రాలేదు. ఏ ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు రాలేదు’ అని మండిపడ్డారు. కేసీఆర్ గురుకులాలను ఏర్పాటుచేసి లక్షలాది మందిని చదివిస్తే గురుకులాలు నడపడం చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. వీరి పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 57 మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్ ద్వారానే ఉద్యోగాలిచ్చి, అవన్నీ తామే ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఇటు సూర్యుడు అటు ఉదయించినా రాబోయే కాలమంతా గులాబీ శకమే. ఈ తీర్పును ఎవరూ మార్చలేరు. లోకల్‌బాడీ ఎన్నికల్లో, రాబోయే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురబోతున్నది.
-ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి అని కవిత వ్యాఖ్యానించారు. కార్మికులు, కర్షకులు, ఆటోవాలాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని దుయ్యబట్టారు. ఉద్యోగులు తమతో గోడు వెళ్లబోసుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ ఉన్నప్పుడు 40% పీఆర్సీ పెంచారని, సమయానికి డీఏలు ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ వచ్చినంక పెండింగ్ డీఏలు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సును స్వాగతించామని, కానీ ఉచితం పేరుతో రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచకపోగా బస్సుల సంఖ్యను తగ్గించారని, దీంతో ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
నాడు కొలువు వచ్చినోళ్లకు ఇంటికి ఆర్డర్ కాపీ పోతుండేది. ఇప్పుడు చెప్రాసీ ఉద్యోగం నుంచి ఉన్నత ఉద్యోగమైనా ముఖ్యమంత్రే ఇస్తున్నడు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా చెయ్యలె. మభ్యపెట్టడానికి ఇలా చేస్తున్నరు. యువ మిత్రులు పిడికిలి ఎత్తి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అడగాలె.
-ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కేంద్ర కక్ష సాధింపు, రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్ని ఎన్ని కేసులు పెట్టినా ప్రజలంతా కవితమ్మతోనే ఉన్నారనే విషయం ఈరోజు రుజువైందని ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని విమర్శించారు. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతపై కవిత ఆధ్వర్యంలో ఉద్యమం నడుస్తుందని చెప్పారు. లోక్‌సభలో ఎంపీ లేకపోయినా, రాజ్యసభ ఎంపీలతో కేంద్రంపై బీఆర్ఎస్ యుద్ధం కొనసాగుతుందని స్పష్టంచేశారు. తెలంగాణకు న్యాయం జరగేలా పోరాటం చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ఉంటేనే కేంద్రంలో, రాష్ట్రంలో మనకు లాభమని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన కాంగ్రెస్‌కు భవిష్యత్‌లో ప్రజలు ఆరు సీట్లకే పరిమితం చేయబోతున్నట్టు తెలిపారు.
‘మన సంస్కృతికి నిలువుటద్దమైన తెలంగాణ తల్లిని వద్దంటున్నరు. హస్తం గుర్తు కలిగిన కాంగ్రెస్ బొమ్మను సెక్రటేరియట్లో పెట్టారు. ఆమెనే మనం మొక్కాలని చెప్తున్నారు. బతుకమ్మను పట్టుకున్న తల్లిని వద్దంటున్నరు. ఒప్పుకుందామా? మన తెలంగాణతల్లి మనకు కావాల్నా? వద్దా? అని ప్రజలను కవిత అడిగారు. తెలంగాణతల్లి మాదిరా… కాంగ్రెస్తల్లి మీదిరా… అంటూ గట్టిగా నినదించగా ప్రజలు సైతం కోరస్ అందుకున్నారు. మన సంస్కృతి మీద, పొట్ట మీద దాడి చేస్తున్న కాంగ్రెస్ సర్కారును ఎదిరిద్దామని పిలుపునిచ్చారు. నిర్బంధాలు ప్రయోగించినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఉద్యమంలో తొలి జడ్పీ పీఠాన్ని గెలిపించిన జిల్లా నిజామాబాద్ అని గుర్తుచేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రుచి చూపిద్దామని పిలుపునిచ్చారు.
ఇష్టమొచ్చిన మాటలు మాట్లాడుకుంటూ కాలం గడుపుతున్న చేతకాని దద్దమ్మ రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ విజయం సాధించబోతున్నదని చెప్పారు. టీవీల్లో రేవంత్‌రెడ్డి కనిపిస్తే ప్రజలు చానళ్లను మార్చేస్తున్నారని, ప్రజలు అంతగా అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి ఆయేషా ఫాతిమా, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నిజామాబాద్ నగర అధ్యక్షుడు సిర్సరాజు, మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ తదితరులు పాల్గొన్నారు.