నీటి సంరక్షణకు ప్రభుత్వాలను కదిలిస్తాం
పరీవాహక ప్రాంత పరిరక్షణతోనే నదుల సంరక్షణ సాధ్యం
కేంద్రానికి జలవిధానమే లేదు
నదుల పునరుజ్జీవ సదస్సులో వక్తలు
హైదరాబాద్, ఫిబ్రవరి 27 : మానవ చర్యలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే దేశంలోని నదులు అంతర్థానమయ్యే పరిస్థితి నెలకొన్నదని, నోరు లేని ఆ నదుల గోసను వినిపించే గొంతుక అవుతామని హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన నదుల పునరుజ్జీవ జాతీయ సదస్సు ప్రకటించింది. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్, తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్, పెనిన్సులర్ రివర్ బేసిన్ కౌన్సిల్ చైర్మన్ వీ ప్రకాశ్ అధ్యక్షతన నిర్వహించిన జాతీయ సమ్మేళనం ఆదివారంతో ముగిసింది. సమ్మేళనంలో వివిధ రాష్ర్టాల్లో నదుల పునరుజ్జీవనానికి కృషిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణ వేత్తలు, నీటి రంగ నిపుణులు హాజరై తమ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకొన్నారు. తమ రాష్ర్టాల్లోని నదీ పరీవాహక ప్రాంతాల పరిస్థితితో పాటు చేపట్టబోయే భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. అ విశేషాలు వారి మాటల్లోనే..
ప్రజాసమూహంతో ప్రభుత్వాలను కదిలిస్తాం
నదుల పునరుజ్జీవం అంటే ఒక్క ప్రధాన నదితో ముడిపడిన అంశం కాదు. ఆ నది పరీవాహక ప్రాంత పరిరక్షణ కూడా ముఖ్యమే. పరీవాహక ప్రాంతాన్ని సంరక్షించకుండా నదుల సంరక్షణ సాధ్యం కాదు. ఇది ప్రభుత్వ కేంద్రీకృత విధానాలతో సాధ్యం కాదు. వికేంద్రీకరణ విధానాలను అవలంబించాలి. ప్రజలను భాగస్వామ్యం చేయాలి. అందుకే దేశ ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసి, ఆ దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతాం. ఈ ఉద్యమంలో కలిసివచ్చే రాజకీయ పార్టీలను కలుపుకొనిపోతాం. నదుల పునరుజ్జీవమే మా ధ్యేయం. దీనిలో అందరూ భాగస్వాములే.
– డాక్టర్ రాజేంద్రసింగ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా
ప్రజల భాగస్వామ్యం కీలకం
నదుల పునరుజ్జీవానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నది. ఆ దిశగా దేశంలోని అన్ని ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. నదులు సజీవంగా ఉంటేనే మానవ మనుగడ. లేదంటే అంతా వినాశమే. ఇందులో ప్రజల భాగస్వామ్యమే అత్యంత కీలకం. నదుల పునరుజ్జీవం కోసం పరిపూర్ణమైన మ్యానిఫెస్టోను రూపొందించాం. దీనిపై విస్తృతంగా చర్చించి తిరిగి హైదరాబాద్ వేదికగానే భవిష్యత్తు ప్రణాళికను ప్రకటిస్తాం.
– వీ ప్రకాశ్, చైర్మన్, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ
నదికి బౌండరీలను ఏర్పాటు చేయాలి
దేశంలోని నదుల పరీవాహక ప్రాంతాలు కుచించుకుపోతున్నాయి. ప్రభుత్వాలు టూరిజం అభివృద్ధి పేరిట, ప్రజలు ఆవాసాల పేరిట ఆక్రమిస్తున్నారు. ఫలితంగా వరదలు పోటెత్తుతున్నాయి. ఇదే కొనసాగితే భవిష్యత్తులో అంతా జలవిలయమే. ఇప్పటికైనా దేశంలోని ప్రతి నదికి, దాని పరీవాహక ప్రాంతానికి సంబంధించి కచ్చితమైన ప్రాదేశిక సరిహద్దులను గుర్తించాలి. అవి ఆక్రమణకు గురికాకుండా చూడాలి.
– వెంకటేశ్ దత్తా, హర్యానా
నదుల వద్ద పరిశ్రమల ఏర్పాటును నిరోధించాలి
నదుల కాలుష్యానికి ప్రధాన కారణం పరిశ్రమలే. మహారాష్ట్రలో అనేక నదులు, వారి పరీవాహక ప్రాంతాలే అందుకు ఉదాహరణ. దేశంలో మద్యం షాపులను ఏర్పాటు చేయాలంటే గుడికి, బడికి ఇంత దూరం ఉండాలని నిబంధన ఉన్నది. అదే తరహాలో నదీ పరీవాహక ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు కూడా నియమాలను రూపొందించాలి. ఎకో సెన్సివిటీ జోన్లో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వొద్దు. పరిశ్రమల వ్యర్థాలను పూర్తిగా శుద్ధి చేశాకే బయటకు విడుదల చేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
– స్నేహల్ దౌండే, మహారాష్ట్ర
గంగ ప్రక్షాళనలో చిత్తశుద్ధి లేదు
కేంద్రం చిత్తశుద్ధితో గంగా నది ప్రక్షాళన చేపట్టడం లేదు. నదిలో మానవ వ్యర్థాలు, మురుగునీరు, పరిశ్రమల వ్యర్థాలు కలువకుండా చర్యలు తీసుకోవడం లేదు. కేవలం గంగానదిని ఆనుకొని ఉన్న ఘాట్లను విస్తరిస్తున్నది. మత్స్యకారుల నివాస సముదాయాలను తొలగిస్తున్నది. హెలిప్యాడ్లను నిర్మిస్తున్నది. గంగ ప్రక్షాళనకు ఎందుకిదంతా? దాని ఉద్దేశం గంగామాతను కూడా వాణిజ్యపరం చేయడమే.
– సౌరభ్, యూపీ
నమామి గంగే పేరిట విధ్వంసం
నమామి గంగే ప్రాజెక్టులో భాగంగా గంగా పరీవాహకంలోని నదులను సంరక్షిస్తామని చెప్తున్న కేంద్రం.. అందుకు విరుద్ధమైన చర్యలు చేపడుతున్నది. ఉత్తరాఖండ్లో ఏకంగా 2 లక్షల మొక్కలను నరికేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి చర్యలను వెంటనే నిలిపేందుకు అందరూ నడుం కట్టాలి. కేంద్రానికి స్పష్టమైన జలవిధానమేదీ లేదు.
– సురేశ్, ఉత్తరాఖండ్
చెరువులను పునరుద్ధరించాలి
నదుల పునరుజ్జీవంలో భాగంగా మొదటగా ఆయా పరీవాహక ప్రాంతాల్లోని చెరువులను పునరుద్ధరించాలి. పూడికలను తొలగించాలి. ఫలితంగా భూగర్భజలాలు పెరుగుతాయి. నదుల్లోకి నీరు చేరుతుంది. వరదను కూడా నియంత్రించవచ్చు. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో దీన్ని అమలు చేసి చూపాం. ఈ కార్యక్రమాలకు ప్రభుత్వాలే పూనుకోవాలి. ప్రజలను భాగస్వామ్యం చేయాలి.
– వనితా మోహన్, కర్ణాటక
నదులతోనే జాతి సౌభాగ్యం
జలమే మానవ, సకల జీవరాశి మనుగడకు ప్రాణాధారం. జల సౌభాగ్యం మీదే జాతి సౌభాగ్యం ఆధారపడి ఉన్నది. అందుకే నదులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. నదులకు కూడా మానవ హోదా కల్పించాలి. హక్కులను ప్రసాదించాలి.
– ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్