వినాయకనగర్, జూలై 6: ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు భర్తను దారుణంగా హతమార్చింది. గల్ఫ్ నుంచి వచ్చిన మూడ్రోజులకే బంగ్లా పైనుంచి తోసేసింది. గాయాలతో బయటపడి దవాఖానలో చేరిన భర్తను కిరాతకంగా అంతమొందించింది. స్లైన్‌లో టాయిలెట్ క్లీనర్ కలిపి ఎక్కించడంతో అతడు చనిపోయాడు. నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేశ్‌కుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం న్యాల్కల్కు చెందిన ప్రశాంత్ (35), సంధ్య దంపతులు. కుటుంబ పోషణ నిమిత్తం ప్రశాంత్ కొన్నేండ్లుగా దుబాయ్‌కి వెళ్లి వస్తున్నాడు.
నిజామాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానలో నర్సుగా పని చేసే సంధ్యకు అనిల్‌తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండేండ్ల తర్వాత ప్రశాంత్ గత నెల 27న దుబాయ్ నుంచి తిరిగి వచ్చాడు. అనిల్‌తో తన సంబంధాన్ని కొనసాగించేందుకు భర్తను అడ్డు తొలగించుకోవాలని సంధ్య పథకం వేసింది. తనకు పరిచయమున్న న్యాల్కల్ వాసి బంటితో పథకం రచించింది. జూన్ 29న ప్రశాంత్, బంటి కలిసి తమ ఇంటి దాబాపై మద్యం తాగేలా ఏర్పాట్లు చేసింది. ఫుల్లుగా మద్యం తాగిన భర్తను సంధ్య, బంటి కలిసి దాబా పైనుంచి కిందికి తోసేశారు. కానీ ప్రశాంత్ గాయాలతో బయట పడటంతో ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించారు.
ఇంటికి వచ్చిన భర్త ఎక్కడ కోలుకుంటాడోనని భావించిన సంధ్య.. అడ్డు తొలిగించుకునేందుకు ఇదే సరైన సమయమని భావించింది. అతని చేతికి ఉన్న స్లైన్ క్యాన్ ద్వారా టాయిలెట్ క్లీనర్‌ను ఎక్కించింది. దీంతో పరిస్థితి విషమించి ప్రశాంత్ కన్నుమూశాడు. ప్రశాంత్ మృతికి కోడలు సంధ్యతోపాటు మరో వ్యక్తిపై అనుమానం వ్యక్తంచేస్తూ తల్లి జూన్ 30న పోలీసులను ఆశ్రయించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. సంధ్య, బంటిని అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేసినట్టు అంగీకరించారు. దీంతో వారిద్దరితోపాటు అనిల్‌ను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.