కోటపల్లి, డిసెంబర్ 15: భార్య పంచాయతీ ఎన్నికల బరిలో నిలువగా, భర్తను రేషన్ డీలర్ విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొండంపేటలో సోమవారం చోటుచేసుకున్నది. కొండంపేట రేషన్ డీలర్‌గా నీల మనోహర్ కొనసాగుతున్నారు. ఆయన భార్య నీల సంతోషి సర్పంచ్ అభ్యర్థి (స్వతంత్ర)గా నామినేషన్ వేసిన వెంటనే పోటీ నుంచి తప్పుకోవాలని అధికార పార్టీ నుంచి ఒత్తిడి పెరిగింది.
గ్రామస్థుల నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా అధికారులు మాత్రం దూకుడు కొనసాగించారు. భార్య సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉండటంతో మనోహర్ ప్రచారం చేస్తున్నాడు. ఈ క్రమంలో మనోహర్‌ను రేషన్ డీలర్షిప్ నుంచి తొలగిస్తున్నట్టు సోమవారం ఉత్తర్వులు అందజేశారు. తన భార్య సర్పంచ్‌గా గెలిచే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ నేతలు కక్షసాధింపు చర్యలకు దిగినట్టు మనోహర్ పేర్కొన్నాడు.
ఖమ్మం రూరల్, డిసెంబర్ 15: పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని అధికార పార్టీ నాయకులు తమ అక్కసును ఓటర్లపై చూపుతున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఆదివారం రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా భూక్యా ప్రమీల, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిగా భూక్యా శైలజ పోటీచేశారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఓటమి చెందడంతో తట్టుకోలేకపోయారు. అదే రాత్రి కొందరు ఓటర్ల ఇండ్లకు వెళ్లి.. తాము ఇచ్చిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలని గొడవకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.