వరంగల్‌చౌరస్తా, జనవరి 7: తన ఆస్తిని కాజేయడంతోపాటు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆగ్రహించిన భార్య.. కత్తితో భర్తపై దాడికి యత్నించింది. ఈ ఘటన బుధవారం వరంగల్‌లో చోటుచేసుకున్నది. మహిళ కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన మే రుగు శ్రీకాంత్, జ్యోత్స్న దంపతులు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు కొనసాగుతుండగానే.. ఆస్తి తనను దక్కకుండా చేస్తున్నాడని, మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపిస్తూ జ్యోత్స్న బుధవారం శ్రీకాంత్ నడుపుతున్న జ్యుయెలరీ షాపు వద్దకు కత్తితో వచ్చింది. భర్తపై దాడి కి యత్నిస్తుండగా అతను తప్పించుకొని వెళ్తుండగా వెంబడించింది. భర్త శ్రీకాంత్‌ను స్థానికులు అక్కడి నుంచి తప్పించారు. కొద్దిసేపు అక్కడే జ్యుయెలరీ షాపు ముందు బైఠాయించింది. పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకొన్నారు. మహిళ మానసికస్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.