హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో 42శాతం బీసీ రిజర్వేషన్ల డిమాండ్‌కు విశాల మద్దతు ఉన్నది.. అగ్రకులాల (ఓసీ) వారు కూడా తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.. రాజకీయ రిజర్వేషన్లతోపాటు విద్యా, ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ల అమలుకు కొందరు ఓసీ నాయకులూ తమ తరఫున నిలబడుతున్నారు’ బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరాపార్కు వద్ద మంగళవారం జరిగిన బీసీల మహాధర్నాకు హాజరైన మేధావులు, న్యాయకోవిధులు, జడ్జీలు, మాజీ ఐఏఎస్‌లు, బీసీ నాయకులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీసీ రిజర్వేషన్లు పెంచొద్దన్న కుట్రతో, న్యాయస్థానాల్లో నిలబడవని తెలిసినా ఆర్డినెన్స్ యోచనను శ్రీనివాస్‌గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు.
రాజ్యాంగబద్ధంగా కాకుండా, ఆర్డినెన్స్ తేవాలనుకోవడం బీసీల చెవుల్లో పూలు పెట్టడమే అవుతుందని ఆగ్రహించారు. రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్యా, ఉద్యోగాలో ్ల 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీసుకొచ్చిన బీసీ బిల్లులను ఆమోదం కోసం ఒకపక్క రాష్ట్రపతికి పంపిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఆర్డినెన్స్ తేవాలనుకోవడం దేనికి సంకేతమని నిలదీశారు. రాజ్యాంగం ప్రకారం 9వ షెడ్యూల్లో సవరణ జరుగకుండా, పార్లమెంట్లో ఆమోదం పొందకుండా, దొడ్డిదారిలో తీసుకొచ్చే ఈ ఆర్డినెన్స్ కోర్టుల్లో నిలువదని తెలిసినా ముందుకెళ్తున్న రేవంత్‌రెడ్డి సర్కారు వైఖరిపై నిప్పులు చెరిగారు. 9వ షెడ్యూల్లో చేరిస్తే తప్ప బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధ్యంకాదన్న విషయం జస్టిస్ ఈశ్వరయ్యతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు తేల్చి చెప్పారని తెలిపారు.
రిజర్వేషన్ల విషయంలో న్యాయకోవిధులు అభిప్రాయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుతం ఆర్డినెన్స్‌ను గవర్నకు పంపడం ఆక్షేపణీయమని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. 2015 డిసెంబర్లో కేసీఆర్ హయాంలో తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు, సుప్రీంకోర్టులో కొట్టివేసిన సంగతి కాంగ్రెస్ సర్కారుకు తెలిసినా.. కావాలనే సవరణ పేరుతో, మరో ఆర్డినెన్స్‌ను తేవడం బీసీలను మోసం చేయడం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రపతికి పంపిన బిల్లు పెండింగ్‌లో ఉండగానే, గవర్నర్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ పంపడం కాంగ్రెస్ సర్కారు ద్వంద్వ వైఖరికి నిలువెత్తు నిదర్శనమని ఆరోపించారు.
అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి.. బీసీకోటా బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఎలాంటి వివాదాలు లేకుండా రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉండగా, కాంగ్రెస్ ప్రభు త్వం కావాలనే న్యాయ చిక్కులను వెతుక్కుటున్నదని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించాకే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డి మాండ్ చేశారు. ఆర్డినెన్స్‌పై ఎవరూ కోర్టుకు వెళ్లొద్దని ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరడం విడ్డూరమని, కొన్ని రాష్ర్టాల్లో ఎన్నికల ముగిశాక కూడా ఆర్డినెన్స్‌ను కొట్టేసిన సందర్భాలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రిజర్వేషన్ల పేరుతో బీసీ పులి మీద స్వారీ చేయాలని చూడొద్దని, వచ్చే స్థానిక ఎన్నికల్లో మాడి మసైపోతారని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్లో సవరణ తీసుకొచ్చి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ తీసుకొస్తున్న కాంగ్రెస్ పాలకులు రాష్ట్రపతి వద్ద ఉన్న బీసీ బిల్లులను విత్‌డ్రా చేసుకున్నారో? లేదో? తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ క్యాబినెట్లో బీసీలకు 42శాతం మంత్రి పదవులు కట్టబెట్టాలని స్పష్టంచేశారు. బీసీలను మోసగిస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట్టా మధు, బీఆర్ఎస్ నేతలు నందికంటి శ్రీధర్, కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.