హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణను నిరుద్యోగ రహిత రాష్ట్రం గా తీర్చిదిద్దుతామని గొప్పలకు పోయిన కాంగ్రెస్ .. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా జాబ్ క్యాలెండర్‌పై నోరు మెదపకపోవడం దా రుణమని విద్యార్థులు, నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. గ్రూప్-1 ఫలితాలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఉద్యోగాలపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్‌పై నిరుద్యోగుల్లో విస్తృత చర్చ జరుగుతున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ నేతలు, గెలిచిన తర్వాత అటకెక్కించారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ల ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు తప్పా.. రేవంత్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన కొలువులు ఏమీ లేవ ని నిరుద్యోగులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 55 వేల ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించింది. ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రేవంత్ అపాయింట్మెంట్ లెటర్లు మాత్రమే ఇచ్చారని నిరుద్యోగు లు గుర్తుచేస్తున్నారు. కానీ ఆ ఉద్యోగాలు తామే భర్తీ చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల ఖాళీలతో ఏటా జూన్ 2 నాటికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, సెప్టెంబర్ 17నాటికి నియామకాలు పూర్తి చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టింది. గెలిచిన తర్వాత ఇప్పుడు రెండో సెప్టెంబర్ కూడా వచ్చిందని, జాబ్ క్యాలెండర్ ఎక్కడ? అని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. 2024 ఏడాది ముగింపు నాటికి.. రాష్ట్రంలో 9వేల మంది, 2025 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి మరో 9 వేల మంది ఉద్యోగ విరమణ పొందారు. ఇవన్నీ వెంటనే భర్తీ చే యాల్సిన పోస్టులైనప్పటికీ నియామకాలు చేపట్టడంలో సరారు విఫలమైందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. టీఎస్పీఎస్సీకి ఇద్ద రు చైర్మన్లు మారినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శిస్తున్నారు. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీలో మార్పులు చేపట్టామని సీఎం రేవంత్ గొప్పగా చెప్పుకుంటున్నారని, కానీ ఆయన హయాంలో నిర్వహించిన ఒకే ఒక పరీక్షను కూడా హైకోర్టు కొట్టివేసిందని ఎద్దేవా చేస్తున్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టిన మేధావులకు మాత్రం పదవులు ఇచ్చుకున్నారని, జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్లు చేయాలని, నిరుద్యోగ భృతి విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.