హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పోలీస్ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ‘బిగ్ బ్రదర్.. షాడో హోం మినిస్టర్’ పేరుతో ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టిస్తున్నది. హైదరాబాద్లోని ట్రై కమిషనరేట్ల పరిధిలో కొందరు డీసీపీలు, ఏసీపీలు ‘బిగ్ బ్రదర్’తోపాటు ఓ అడ్వైజర్, చోటా భాయ్ అండతో రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లలో తలదూర్చుతున్న వైనాన్ని ఆ కథనంలో వివరించడంతో ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.
‘నమస్తే తెలంగాణ’ కథనం ఆధారంగా ఆదివారం పలువురికి కాల్స్ చేసి, వివాదాస్పద డీసీపీలు, ఏసీపీల వివరాలు తీసుకున్నారు. ‘బిగ్ బ్రదర్.. షాడో హోం మినిస్టర్’ కథనంపై ఆదివారం ఉదయం నుంచే పోలీస్ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరిగింది. పోలీస్ శాఖలో ‘బిగ్ బ్రదర్’ మితిమీరిన జోక్యం, షాడో హోం మంత్రిగా ఆయన అడ్డగోలుగా వ్యవహరిస్తుండటం నిజమేనని సీనియర్ అధికారులు చర్చించుకున్నారు. కొందరు ‘నమస్తే తెలంగాణ’ కార్యాలయానికి కాల్ చేసి మరీ అభినందించారు. బిగ్ బ్రదర్, అడ్వైజర్, చోటా భాయ్ పోలీస్ శాఖను భ్రష్టు పట్టిస్తున్న తీరును బయటపెట్టారని తెలిపారు.