వెల్గటూర్, సెప్టెంబర్ 10: ‘ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనను పూర్తిగా గాలికొదిలేసింది. ఫలితంగా పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారు. దవాఖానల్లో వసతులు, మందులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా.. ప్రభుత్వానికి ప్రజారోగ్యంపై కనీస పట్టింపులేకుండా పో యింది’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్, ఎండపల్లి మండలాల్లో విష జ్వరాలతో మృతిచెందిన వారి కుటుంబాలను మంగళవారం పరామర్శించారు. వెల్గటూర్‌లో కొప్పుల మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ నాయకులు కాలం గడుపుతున్నారని, ఫలితంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించి డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయని మండిపడ్డారు.
గత ఏడెనిమిదేండ్లలో ఒక్క డెంగ్యూ కేసైనా నమోదైందా? ప్రజలు ఆలోచించాలని సూచించారు. ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్నారని, ప్రభుత్వ దవాఖానలకు వెళితే వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కనీస పట్టింపులేకుండా పోయిందని, ఆయన ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే నియోజకవర్గాల్లో సొంత పనులు చేసుకుంటున్నారని, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా వైద్యులు, అధికారులతో రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.