హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): జలవివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల్‌శక్తి శాఖతో జరుగనున్న భేటీపై తెలంగాణ ఇంజినీర్లు, నీటిరంగ నిపుణులు అంతర్మథనంలో పడిపోయారు. చర్చల్లో ఒనగూరే ప్రయోజమేమిటో అంతుబట్టక మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో అనేకమార్లు విన్నవించినా, ట్రిబ్యునల్ అవార్డుతో ముడిపడిన అంశాలను, సమస్యలను నిపుణుల కమిటీ ఎలా పరిష్కరిస్తుంది? అంటూ ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జలాలకు సంబంధించిన అంశాలకే సమావేశంలో పరిమితవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్దేశించినా, చర్చలకంటూ వెళ్లాక అలా కట్టుబడి ఉండ టం సాధ్యమేనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుకు ఆమో దం కోసమే ఏపీ ఒత్తిడితో కేంద్రం చర్చలకు తెరలేపిందని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య జలవివాదాల పరిష్కారానికి 15 మంది అధికారులతో కేంద్రం ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. కమిటీకి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అనుపమ్ ప్రసాద్ నేతృత్వం వహించనుండగా, ఇరు రాష్ర్టాలు, పలు కేంద్ర సంస్థల నుంచి కీలక అధికారులు పాల్గొననున్నారు. ఈ నిపుణుల కమిటీ న్యూఢిల్లీ సేవాభవన్‌లోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో 30వ తేదీన తొలిసారి భేటీ కానున్నది. ఈ నేపథ్యంలో కమిటీ భేటీ కోసం ఎజెండాను ఎంపిక చేసే అంశంపై తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తున్నది.
‘నల్లమలసాగర్’ కోసమే..!
తెలంగాణ ప్రభుత్వం కమిటీ భేటీలో గోదావరి జలాలకు సంబంధించిన అంశాలపై కాకుండా, కేవలం కృష్ణా జలాలకు సంబంధించిన అంశాలపైనే ప్రస్తావించాలని, ఆ దిశగానే దృష్టి సారించాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్నది. వాస్తవంగా గోదావరి జలాలను మళ్లించేందుకు పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టును ఏపీ సర్కారు చేపట్టింది. ఇది బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని తెలంగాణ ఇప్పటికే స్పష్టం చేసింది. గతంలో కేంద్ర జల్‌శక్తిశాఖ నిర్వహించిన సమావేశంలో ఏపీ ఈ ప్రాజెక్టునే ఏకైక ఎజెండాగా ముందుపెట్టింది. ఇప్పుడు కూడా ఏపీ నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టునే తెరమీదకు తెచ్చే అవకాశముంది. కేంద్రం సైతం గతంలో ఎన్నడూ లేనివిధంగా కమిటీ ఏర్పాటు చేసింది కూడా ఏపీకి లబ్ధి చేకూర్చేందుకేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి అడుగడుగునా వత్తాసు పలుకుతున్న కేంద్ర జల్శక్తిశాఖతో భేటీ కావడమే మహా తప్పిదమని ఇంజినీర్లు, నీటిరంగనిపుణులు వివరిస్తున్నారు.