Telangana | హైదరాబాద్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ) : ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు.. రాష్ట్రంలో జరుగుతున్నది ఆటవిక పాలన. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను ఎండగడుతున్న కేటీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నది. కేటీఆర్ కేంద్రం గా, కేటీఆర్ చుట్ట్టూ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నది. శనివారం రాత్రి జన్వాడ వద్ద కేటీఆర్ బంధువుల ఇంట్లో జరుగుతున్న కుటుంబ దావత్ మీద పోలీసులు దౌర్జన్యంగా దాడులు చేసి, పసిపిల్లలను, వృద్ధులను, మహిళలను ఫొటోలు తీస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేసినతీరు అత్యంత జుగుప్సాకరం. రాజకీయ విభేదాలు, వైషమ్యాలు ఉంటే.. రాజకీయంగానే చూసుకోవాలి. కానీ, పసిపిల్లలు, వృద్ధులపైకి స్నిఫర్డాగ్స్ను ఉసిగొల్పడం పరమ దాష్టీకం.అక్కడితో ఆగకుండా రాయదుర్గంలో ఉన్న కేటీఆర్ ఇంటి మీద దాడులు, సోదాలు చేయడం, ఫ్యామిలీ దావత్‌ను రేవ్ పార్టీ పేరుతో దుష్ప్రచారం చేయడం విశృంఖల బరితెగింపుతనం. శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం రాత్రి 10 గంట ల వరకు దాదాపు 23 గంటలపాటు పోలీసుల దాడులను ప్రహసనంగా సాగదీయడం సీఎం పైశాచిక ఆనందంలో భాగమే.
నిజానికి పోలీసులు దాడి చేసింది ఫామ్‌హౌస్ మీద కాదు.. రాజ్ పాకాల ఇంటి మీద. కుటుంబసభ్యులతో కలిసి కొంతకాలంగా ఆయన అక్కడే నివాసం ఉంటున్నారు. పోలీసులు దాడి చేసిన సమయంలో ఆయన కుటుంబసభ్యులు అంతా అంటే ఆయన 70 ఏండ్ల తల్లి, ఆమె చెల్లెలు, వారి పిల్లలు, రాజ్ పాకాల సోదరులు, చిన్నమ్మ పిల్లలు ఇలా.. దాదాపు రెండేండ్ల పసిపిల్లల దగ్గర నుంచి 70 ఏండ్ల వృద్ధుల వరకు అందరూ అక్కడే ఉన్నారు. ఇలాంటి కుటుంబ దావత్‌లపై పోలీసులు దాడులు చేయడమే చట్ట విరుద్ధం. కుటుంబం చేసుకుంటున్న ఫంక్షన్‌లోకి వెళ్లి పిల్లలను, మహిళలను ఫోన్లు, కెమెరాలతో వీడియోలు తీస్తూ తీవ్ర మానిసిక వేదనకు గురిచేయడం ఆక్షేపణీయం. దాడులు చేస్తున్న వాళ్లు పోలీసులో,ఆ ముసుగులో వచ్చిన బందిపో ట్లో అర్థం కాక వారు హడలిపోయారు. కానీ, ముఖ్యమంత్రి అనుకూల సోషల్‌మీడియాలో దీనిని రేవ్‌పార్టీ, డ్రగ్స్‌పార్టీ అంటూ అడ్డగోలు గా దుష్ప్రచారం చేస్తున్నారు. దావత్లో ఉన్న పసిపిల్లలు, వృద్ధులను రేవ్ పార్టీలో పాల్గొన్న స్త్రీలు, పురుషులు అంటూ ముఖ్యమంత్రి పీఆర్వో ప్రేరిత మీడియా ఇష్టం వచ్చిన స్క్రిప్ట్‌తో విష ప్రచారం చేస్తున్నది.
దాడుల్లో తాగేసిన సీసా, లిక్కర్ ఉన్న సీసాల్లో కలిపి మొత్తం 10.5 లీటర్ల ఇండియన్ మేడ్ విదేశీ మద్యం దొరికినట్టు ఎక్సైజ్‌శాఖ పంచనామాలో పేర్కొన్నారు. తెలంగాణ ఏ-4 రిటైల్ దుకాణాల నుంచి కొనుగోలు చేసిన మద్యం కొంత దొరికింది. రాజ్ పాకాల తాను కొన్న డ్యూటీ ఫ్రీ మద్యానికి సంబంధించిన అన్ని బిల్లులు ఎక్సైజ్ అధికారులకు అందజేశారు. ఈ బిల్లులతో అధికారులు సంతృప్తి చెందినప్పటికీ, ఇంకా ఏమైనా నిషేధిత డ్రగ్స్ వాడుతున్నారా?అనే అనుమానంతో పోలీసు జాగిలాలతో (డాగ్‌స్కాడ్) తనిఖీలు చేయ గా, ఎటువంటి డ్రగ్స్ దొరకలేదు. పోలీసు పంచనామాలో ఇవే అంశాలను పొందుపరిచారు. విదేశీ మద్యంలో కొంత డ్యూటీఫ్రీ మద్యం ఉన్నట్టు పంచనామాలో రాశారు. డ్యూటీఫ్రీ మద్యం అంటే ఎయిర్‌పోర్టు స్టోర్లలో దొరికే మద్యం. విదేశీ ప్రయాణాలు చేసేవారు మనిషికి రెండు బాటిళ్ల చొప్పున తెచ్చుకోవచ్చు. ఇది ఎన్డీపీఎల్ మద్యం కిందకు రాదు. కుటుంబ సభ్యుల దావత్ కాబట్టి వాళ్ల వద్ద ఉన్న బాటిల్స్ తెచ్చుకొని, ఒక్క దగ్గర పెట్టుకొని వారి ఇంట్లో వారు తాగుతున్నారు. ఇది చట్ట సమ్మతమే. కానీ, వారి మీద దౌర్జన్యంగా పోలీసులు దాడికి పూనుకోవడం, కేసులు నమోదుచేయడం రాజ్యాంగ విరుద్ధం. అయినా ఎక్సైజ్ పోలీసులు ఇంటి బాధ్యతలు చూసుకునే మేనేజర్ కార్తీక్ రాజేశ్ అనే వ్యక్తి మీద యూ/ఎస్ 34 ఏ, 34(1) ,ఆర్/డబ్ల్యూ 9 ఆఫ్ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదుచేశారు. ఎక్సైజ్ చట్టాల ప్రకారం సొంత ఇండ్లలో జరిగే ఫ్యామిలీ దావత్‌కు ఈవెంట్ పర్మిషన్ కూడా అవసరం లేదు. ఒకవేళ ఎక్సైజ్ పోలీసులు దీనిని ఈవెంట్‌గానే గుర్తిస్తే ఎక్సైజ్ సెక్షన్ 34 ఏ ప్రకారం రూ. 5,000 కాంపౌండ్ జరిమానాతో కేసు ముగుస్తుంది. ఇంత చిన్న కేసును నానా రాద్ధాంతం చేస్తూ.. ఆదివారం కేటీఆర్ ఇంటి మీది కూడా దాడికి తెగబడటం రాజ్యాంగ బరితెగింపు కాకుంటే ఇంకేమిటి?
ఇటువంటి దాడి ఒకటి జరుగబోతున్నదని కాంగ్రెస్ పాలకులు వారం రోజుల నుంచే లీకు లు ఇస్తున్నారు. వాస్తవంగా రాజ్ పాకాల తన కొత్త ఇంటి గృహ ప్రవేశం దావత్‌కు రండి అంటూ అతని చిన్నమ్మ పిల్లలు, సోదరులను పిలుస్తున్నట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా విషయం పసిగట్టిన రేవంత్‌రెడ్డి ప్రభు త్వం కేటీఆర్ టార్గెట్‌గా ఉచ్చు పన్నింది. అందులో భాగంగానే కొంతమంది జర్నలిస్టులను తీసుకొని సియోల్ పర్యటనకు వెళ్లిన సమాచార శాఖ మంత్రి.. అక్కడ ఉండగానే త్వరలో రాజకీయ బాంబులు పేలబోతున్నట్టు ప్రకటించారు. దానికి కొనసాగింపుగానే, అదే పార్టీ ప్రేరిత సోషల్‌మీడియాలో ఓ ‘కుక్క’ శుక్రవారం నుంచే మొరుగుతున్నది. ట్విట్టర్ లో ‘మీ కాపలా కుక్క’ పేరుతో ఉన్న ఖాతా నుంచి ‘రేపు మీ ముందుకు ఒక బ్లాస్ట్’ అంటూ ట్వీట్ వచ్చింది. అది సోషల్‌మీడియా లో చెక్కర్లు కొట్టింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ డిజిటల్ మీడియా నేతలు సోషల్‌మీడియా వర్క్‌షాప్ పెట్టి,ఈ వీకెండ్లో అందరూ యాక్టివ్‌గా ఉండాలని సూచనలు ఇచ్చారు. అదే రాత్రి సోషల్‌మీడియాలో మీమ్స్, తంబ్నేల్స్తో రెచ్చిపోయారు.
రాజ్ పాకాల ఇంటి మీద జరిగిన దౌర్జన్యకాండను సీఎం కార్యాలయం స్వయంగా మానిటరింగ్ చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి స్వయంగా కొన్ని మీడియా చానళ్లకు ఫోన్ చేసి, త్వరలో రేవ్ పార్టీ బ్రేకింగ్ రాబోతున్నదని,దానిని కథనాలుగా మార్చి ప్రసారం చేయాలని కోరారు. అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి దాడులు చేయించారు. ఇంట్లో తీసిన వీడియోలు, విజవల్స్, ఫొటోలను అధికారులను బలవంతపెట్టి నేరుగా సీఎంవోకు తెప్పించుకున్నారు. సీఎం పీఆర్వో వాటిని తమ అనుకూల సోషల్‌మీడియాలోకి వదిలారు. పోలీసుల పర్యవేక్షణలో ఎక్సైజ్ శాఖ అధికారులు అన్నివిధాలుగా పరిశీలించి, కేవలం డ్యూటీ ఫ్రీ మద్యం మాత్రమే పట్టుకొని ఎక్సైజ్ కేసులు నమోదుచేశారు. కానీ, స్వయంగా ముఖ్యమంత్రి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి, ఆ కేసును మధ్యాహ్నానికి ఎన్డీపీఎస్ యాక్టు (నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్) కేసుగా మార్చారు. సాధారణంగా ఈ తరహా ఇంటి దావతుల మీద దాడులకు స్నిఫర్డాగ్స్ను తీసుకెళ్లరు. కానీ, రేవంత్‌రెడ్డి ఆదేశాలతో దాదాపు 300 మంది పోలీసులు ఐదు స్నీపర్డాగ్స్, అధునాతన ఆయుధాలతో బీభత్సం సృష్టించారు. ఇక్కడ జరిగిన ప్రతి సన్నివేశానికి మసాలా జోడిస్తూ సీఎంవోలోని పీఆర్వోలు ఎప్పటికప్పుడు దీనిని రేవ్పార్టీగా చిత్రీకరిస్తూ సోషల్‌మీడియాలో, డిజిటల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ వచ్చారు.
జన్వాడలో పోలీసులు దాడులు చేయడమే దౌర్జన్యం, చట్టవిరుద్ధం. దానికి కొనసాగింపుగా ఆదివారం కేటీఆర్ ఇంటి మీద కూడా దాడులు చేసి సోదాలు చేయడం బరితెగింపునకు తార్కాణం. కేటీఆర్ తన బామ్మర్ది దావత్‌కు అసలు వెళ్లనే లేదు. కాంగ్రెస్ ప్రచార మీడియా మాత్రం కేటీఆర్ దావత్‌కు వచ్చి, దాడికి పది నిమిషాల ముందే వెళ్లిపోయారని కథనాలు ప్రచారం చేశాయి. వాస్తవానికి శనివారం రాత్రే ఐదు పోలీసు జాగిలాలతో ఇంటిని అణువణువూ వెదికారు. అక్కడ డ్రగ్స్ ఆనవాళ్లు దొరకలేదు. అయినా రాజ్ పాకాలను, దావత్లో ఉన్న మరో 13 మందిని బలవంతంగా డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలకు పంపించా రు. ఆ పరీక్షల్లో రాజ్ పాకాల డ్రగ్ వాడలేదని తేలింది. మిగిలిన 13 మందిలో 12 మందికి నెగటివ్ వచ్చింది. ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. ఇంతమందిలో ఒకరికి మాత్రమే పాజిటివ్ అంటే.. అతను ఎక్కడో డ్రగ్ తీసుకొని ఉంటాడు. తదుపరి దర్యాఫ్తు చేయాలని పోలీసులు భావిస్తే, డ్రగ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంట్లో సోదాలు చేయాలి. కానీ, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి కేటీఆర్ నివాసం మీద దాడులకు ప్రయత్నించారు. ఆతనేమీ సాధారణ వ్యక్తి కాదు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్‌కు ప్రెసిడెంట్. అంతకుముందు ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాదరణ ఉన్న నేత. ఆయన ఇంటి మీదికి సెర్చ్ వారెంటు లేకుండా, కనీస అనుమతి లేకుండా పోలీసులు ఎలా వెళ్లారు? దీనిపై కోర్టులకు ఏమని సమాధానం చెప్తారు.
కేంద్ర మంత్రి పదవి పొందిన తరువాత బండి సంజయ్ దాదాపు ప్రజలకు దూరం అయ్యారు. మూసీ సుందరీకణ పేరుతో ప్రభు త్వం నిరుపేదల ఇండ్లు కూలగొడుతున్నా.. ఆయన ఒక్కమాట మాట్లాడలేదు. రుణమాఫీ కాకున్నా ప్రభుత్వాన్ని పల్లెత్తుమాట అనలేదు. కానీ, దౌర్జన్యపూరితమైన దాడిపై కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియా మొరిగితే.. ఆ వెంటనే స్పందించింది బీజేపీ నేతలే. ఆర్ బ్రదర్ ఫోన్ చేసినట్టు తెలుస్తున్నది. ప్రజా సమస్యల మీద స్పందించని కేంద్ర మంత్రి ఆగమేఘాల మీద వీడియా సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. ఈ లెక్కన రేవంత్ ప్రభుత్వంతో బీజేపీ అంటకాగుతున్నట్టు స్పష్టమవుతున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఆర్థికంగా బాగా స్థిరపడిన చాలామంది ఇండ్లలో బార్రూం ఉంటుంది. వీటికి అనుమతులు అక్కర్లేదు. ఎక్సైజ్ చట్టాలే అటువంటి వెసులుబాటు కల్పించాయి. డూప్లెక్స్, విల్లా ఉన్న చాలామంది ఇండ్లలో బార్రూం ఉంటుంది. ఒక ఎక్సైజ్ సీనియర్ అధికారి అంచనా ప్రకారం హైదరాబాద్‌లో కనీసం 5% ఇండ్లలో హోం బార్లు ఉన్నాయి. వీటిలో 30 నుంచి 50 బాటిళ్ల మద్యం ఉంటుంది. ఇలాంటివారు విదేశీ ప్రయాణాలు చేసినప్పుడు ఆయా దేశాల్లో ప్రత్యేకంగా దొరికన మద్యం తెచ్చుకుంటారు. ఈరోజు రాజ్ పాకాల ఇంటి మీద దాడిచేసినట్టుగానే ఎక్సైజ్ అధికారులు ఇంటువంటి వారి ఇండ్ల మీద కూడా దాడులు చేస్తారా? ఒకవేళ దాడులు చేస్తే ఈ ప్రభుత్వం నిలబడుతుందా?
రేవ్‌పార్టీ అంటే పరిచయం లేని స్త్రీ, పురుషుల సంగమ పార్టీ. లైవ్డ్రగ్స్ వినియోగం, విచ్చలవిడితనం ఉంటుంది. దీనికి తెలంగాణలో అనుమతి లేదు. ప్రైవేట్ పార్టీ అంటే కనీసం వందకుపైగా బంధుమిత్రులతో కలిసి చేసుకునే పార్టీ. ఈ పార్టీలో మద్యం తాగాలంటే ఎక్సైజ్ శాఖ నుంచి ఈవెంట్ పర్మిషన్ అవసరం. ఇంటి పార్టీ అంటే అతి దగ్గరి బంధువులే ఉంటారు. మద్యం, ఆహారం ఉంటుంది. మద్యం తాగే అలవాటు ఉన్న మగవాళ్లు తాగుతారు. మహిళలు ఆహార పదార్థాలు, భోజనాలు ఆరగిస్తారు. పిల్లలు ఆడుకుంటారు. ఈ తరహా ఇంటి దావత్ మీద పోలీసులు దాడులు చేయడం, రేవంత్‌రెడ్డి అనుచరులు రకరకాల పేర్లతో మెయిన్‌స్ట్రీమ్ మీడియా, సోషల్‌మీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేయడం నీతిమాలినతనం.
రేవంత్‌రెడ్డి ఏడాది పాలనలో ప్రతి అడుగూ ప్రజావ్యతిరేక చర్యలకే పాల్పడ్డారు. అధికారం తెచ్చిపెట్టిన ఆరు గ్యారెంటీలు ఇప్పటివరకు అమలు కాలేదు. మూసీనది వ్యవహారం,అవినీతి, ప్రభుత్వ స్కాంలు, హత్యా రాజకీయాలు, అసంపూర్ణ రుణమాఫీ, పోలీసుల హక్కులు, రైతుల ఆత్మహత్యలతో రాష్ట్రం అల్లకల్లోలంగా ఉన్నది. ఒక్క డీఏ మాత్రమే ఇచ్చారని ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. వీటన్నింటినుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే రేవంత్‌రెడ్డి బీజేపీతో కలిసి నాటకం అడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ ప్రతి అడుగూ కలిసే వేస్తున్నారు. వీటిని నిత్యం కేటీఆర్ నిలదీస్తున్నారు. అంబర్‌పేట నుంచి ఆదిలాబాద్ వరకు తిరుగుతూ, ప్రతిరోజూ ప్రజల్లో ఉంటూ ప్రభుత్వాన్ని ఎండగట్టుతుండటంతోనే ఆ రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయనేది బీఆర్ఎస్ నేతల ఆరోపణ.