ఖలీల్‌వాడి, ఏప్రిల్ 28 : ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో విస్కీ బాటిళ్లే కనిపించాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలంటే విస్కీ బాటిళ్లా? ఇసుకేస్తే రాలనంతగా వచ్చిన లక్షలాది మంది కనిపించలేదా? ఇది కాంగ్రెస్ కండకావరమా? లేక అధికార మదమా? అని సోమవారం ఓ ప్రకటనలో నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ సభ సక్సెస్‌పై కాంగ్రెస్‌కు ఎందుకంత అక్కసు అని మండిపడ్డారు. వరంగల్‌లో బీఆర్ఎస్ జనసునామీతో కాంగ్రెస్ సర్కారులో వణుకు మొదలైందని చెప్పారు. ఈ సభ ద్వారా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ భయాన్ని పరిచయం చేసిందని వ్యాఖ్యానించారు. పాలన చేతకాక విపక్షంపై నోరు పారేసుకుంటున్నారని, వారికి కేసీఆర్‌ను విమర్శించే స్థాయిలేదని తెలిపారు. ప్రజలను విస్కీబాటిళ్లతో పోల్చిన పీసీసీ అధ్యక్షుడు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సంబురం అనగానే కాంగ్రెస్ సర్కారు కండ్లలో నిప్పులు పోసుకుందని, సభ జరగకుండా కుట్రలు చేసిందని మండిపడ్డారు. తండోపతండాలుగా తరలివచ్చిన సబ్బండ వర్గాలు, బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండా పవర్ చూపించారని తెలిపారు.